RBI: భారత్‌లోకి మరిన్ని విదేశీ నిధులు.. ఆర్‌బీఐ నిర్ణయాలతో పెట్టుబడులకు కొత్త అవకాశాలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ విషయాలను వెల్లడించారు. భారత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విదేశీ వ్యక్తిగత ఇన్వెస్టర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
వివరాలు
ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలకు పెరిగిన పెట్టుబడి పరిమితులు
సెబీ వద్ద ప్రత్యేక రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే భారత ఈక్విటీ మార్కెట్లో ఎన్‌ఆర్‌ఐలు (నాన్ రెసిడెంట్ ఇండియన్స్), ఓసీఐలు (ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా) పెట్టగలిగే పెట్టుబడి పరిమితులను పెంచుతున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ఇదే సౌకర్యాన్ని విదేశాల్లో నివసించే ఇతర వ్యక్తిగత ఇన్వెస్టర్లకూ విస్తరిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ బాండ్లలో విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశం దేశంలోకి విదేశీ మూలధనాన్ని ఆకర్షించేందుకు ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో కూడా సడలింపులు ప్రకటించారు. 'ఫుల్లీ యాక్సెస్డ్ రూట్' (ఎఫ్‌ఏఆర్) పరిధిలో 15, 30, 40 సంవత్సరాల కాలపరిమితి కలిగిన కొత్త ప్రభుత్వ సెక్యూరిటీలను చేర్చనున్నట్లు ఆర్ బి ఐ తెలిపింది. దీంతో దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడులకు మరింత అవకాశాలు లభించనున్నాయి.
వివరాలు
ఎఫ్‌పీఐలపై పరిమితులకు ముగింపు
జనరల్ రూట్ కింద పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు)పై అమలులో ఉన్న స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, ఇతర నియంత్రణలను పూర్తిగా తొలగిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. ఈ చర్యతో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. విదేశీ నిధుల ప్రవాహానికి ఊతం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పన్ను రాయితీలతో పాటు ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయాలు దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని గణనీయంగా పెంచుతాయని సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
వివరాలు
ఎగుమతి ఆదాయంపై కీలక నిర్ణయం
ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దేశానికి తిరిగి తీసుకురావడానికి అనుమతించే కాలపరిమితిని మళ్లీ తొమ్మిదినెలలకు పునరుద్ధరిస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.ఇది ఎగుమతిదారులకు కొంత ఊరటనివ్వనుంది. రూపాయి విలువపై స్పష్టత భారత విదేశీమారక విధానంలో ఎలాంటి మార్పులు లేవని గవర్నర్ స్పష్టం చేశారు.రూపాయి మారకపు విలువను మార్కెట్ పరిస్థితులు,డిమాండ్-సరఫరా అంశాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. అవసరమైతే మార్కెట్లో జోక్యం అంతర్జాతీయ పరిణామాల కారణంగా కొన్నిసార్లు ఆర్థిక మార్కెట్లలో తీవ్రమైన ఒడుదొడుకులు తలెత్తే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అయితే మార్కెట్ సహజంగా జరిగే మార్పులను అడ్డుకోవడం తమ లక్ష్యం కాదని,అసాధారణమైన, అస్తవ్యస్తమైన కదలికలను మాత్రమే నియంత్రిస్తామని స్పష్టం చేశారు.