Paytm:పేటీయం పేమెంట్స్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్.. షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఫిన్‌టెక్ సంస్థ పేటియంకు చెందిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL)కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)మరో కీలక నిర్ణయంతో షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు ఆంక్షలు, లైసెన్స్ రద్దు చర్యలను ఎదుర్కొంటున్న ఈ బ్యాంకును తాజాగా షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగించింది. ఆర్బీఐ చట్టం-1934లోని రెండో షెడ్యూల్ (Second Schedule)నుంచి PPBL పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ అధికారిక నోటిఫికేషన్ పేటియం పేమెంట్స్ బ్యాంక్‌ను ఆర్బీఐ చట్టం-1934లోని రెండో షెడ్యూల్ నుంచి తొలగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జూలై 31న జారీ చేయగా.. తాజాగా భారత గెజిట్‌లో ప్రచురించారు. ఆర్బీఐ చట్టంలోని రెండో షెడ్యూల్‌లో ఉన్న బ్యాంకులను 'షెడ్యూల్డ్ బ్యాంకులు'గా పరిగణిస్తారు.
వివరాలు
వరుస నిబంధనల ఉల్లంఘనలతో చర్యలు
ఈ జాబితాలోని బ్యాంకులకు కేంద్ర బ్యాంకు నిర్దేశించే ప్రత్యేక నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయి.
ఇప్పుడు PPBLను ఈ జాబితా నుంచి తొలగించడంతో ఆ బ్యాంక్‌కు ఉన్న షెడ్యూల్డ్ బ్యాంక్ హోదా కూడా ముగిసింది.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాల్లో నిబంధనల ఉల్లంఘనలు, డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలు ఉన్నాయని గుర్తించిన ఆర్బీఐ.. గత కొంతకాలంగా దానిపై కఠిన చర్యలు తీసుకుంటూ వచ్చింది.
2022 మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో పలు తీవ్రమైన లోపాలు బయటపడటంతో PPBL కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా ఆర్బీఐ ఆంక్షలు విధించింది.
అదే సమయంలో బ్యాంక్‌పై సమగ్ర ఐటీ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది.
ఆ తర్వాత 2024 జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఆర్బీఐ మరిన్ని పరిమితులు విధించింది.
వివరాలు
ఢిల్లీ హైకోర్టు నుంచి కూడా కీలక ఆదేశాలు
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఖాతాల్లోకి కొత్త డిపాజిట్లు, క్రెడిట్లు స్వీకరించడాన్ని నిలిపివేయడంతో పాటు వాలెట్లు, ప్రీపెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్లలో టాప్-అప్‌లను కూడా నిలిపివేసింది.
ఈ పరిణామాల అనంతరం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విషయంలో చట్టపరమైన చర్యలు మరింత ముందుకు సాగాయి.
బ్యాంక్‌ను మూసివేసే ప్రక్రియకు (Winding up) సంబంధించి ఢిల్లీ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది.
విజయ్ శేఖర్ శర్మ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు అనుబంధంగా కొనసాగిన PPBL.. వరుస నిబంధనల ఉల్లంఘనలు, ఆర్బీఐ ఆంక్షలు, చట్టపరమైన పరిణామాల కారణంగా కీలక మార్పులను ఎదుర్కొంది.
తాజాగా షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగించడంతో ఈ పరిణామాల్లో మరో ముఖ్యమైన అడుగు పడింది.