LOADING...
Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ 
గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ

Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

నెలనెలా ఈఎంఐ చెల్లింపులతో కష్టపడుతున్న గృహ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌ బి ఐ) మరోసారి శుభవార్త అందించింది. కీలక వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (0.50 శాతం) తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం ద్వారా మరింత ఉపశమనం కలిగించింది. ఆర్‌బీఐ ఇలా రెపోరేటును సవరించడం ఈ ఏడాదిలో ఇది మూడోసారి కాగా.., మొత్తం కలిపి ఇప్పటి వరకు 1 శాతం వరకు తగ్గింపును నమోదు చేసింది. తాజా నిర్ణయం వల్ల హోమ్ లోన్ తీసుకున్నవారికి ఈఎంఐ భారం మరింత తగ్గే అవకాశముంది.

వివరాలు 

ఫ్లోటింగ్ రేటుతో ఉన్నవారికి ప్రయోజనం 

2019 అక్టోబర్ 1 తర్వాత తీసుకున్న గృహ రుణాలన్నీ ఫ్లోటింగ్ రేటుతో ఉండటంతో, ఈ తాజా వడ్డీ తగ్గింపు వీరికి ప్రత్యక్షంగా ఉపయోగపడుతుంది. బ్యాంకులు వడ్డీ రేటును తగ్గిస్తే, ఇది వారికి తక్కువ ఈఎంఐగా మారుతుంది. కేవలం ప్రస్తుతం రుణం తీసుకున్నవారికే కాదు, కొత్తగా గృహ రుణం తీసుకునే వారికి కూడా ఇది బాగానే కలిసివచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ వడ్డీకి రుణాలు పొందడమే కాకుండా, ఎక్కువ మొత్తంలో రుణాన్ని పొందగల అవకాశమున్నదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

రుణదారులకు రెండు ప్రధాన ఎంపికలు 

ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం నేపథ్యంలో, రుణదారుల ఎదుట రెండు ఎంపికలు ఉన్నాయి. ఒకటి ఈఎంఐ మొత్తాన్ని తగ్గించుకోవడం, లేదా రెండవది రుణ కాలవ్యవధిని తగ్గించుకోవడం. నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండవ ఎంపిక.. అంటే కాలవ్యవధిని తగ్గించుకోవడం - ఉత్తమమైనదని పేర్కొంటున్నారు. దీని వల్ల దీర్ఘకాలంలో వడ్డీపై గణనీయమైన ఆదా సాధ్యమవుతుంది.

వివరాలు 

ఈఎంఐ ఎంత మేర తగ్గుతుంది? 

ఉదాహరణకు ఈ ఏడాది జనవరిలో 20 ఏళ్ల కాలవ్యవధికి రూ.50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. అప్పటి వడ్డీ రేటు 8.50% అయితే, నెలవారీ ఈఎంఐ రూ.43,391గా ఉండేది. కానీ ఆర్‌బీఐ మూడుసార్లు వడ్డీ రేటు తగ్గించడంతో ఈఈఎంఐ ఇప్పుడు రూ.40,280కి పడిపోయింది. అంటే నెలకు రూ.3,100ల పైగా ఆదా అవుతుంది. దీర్ఘకాలంగా చూస్తే, ఇది మొత్తం రూ.7.12 లక్షల వడ్డీ భారం తగ్గింపుగా మారుతుంది.

వివరాలు 

కాలవ్యవధి తగ్గితే ఆదా ఎలా? 

ఒకవేళ రుణదారులు ఈఎంఐ మొత్తాన్ని అలాగే ఉంచి కాలవ్యవధిని తగ్గిస్తే, రుణ చెల్లింపు వ్యవధి దాదాపు మూడు సంవత్సరాల మేర తగ్గుతుంది. ఉదాహరణకు, జనవరిలో 240 నెలల కాలానికి రూ.50 లక్షల రుణం తీసుకున్నవారికి, తాజా తగ్గింపు కారణంగా అది 206 నెలలకు క్షిణిస్తుంది. ఫలితంగా వడ్డీ పరంగా దాదాపు రూ.14.78 లక్షల ఆదా సాధ్యమవుతుంది. (గమనిక: గృహరుణం తీరడానికి ఉండే సమయం, తీసుకున్న రుణం మొత్తం ఆధారంగా ఈ మిగులు ఆధారపడి ఉంటుంది)

వివరాలు 

అవకాశాన్ని వినియోగించుకోవాలంటే బ్యాంకుల స్పందన కీలకం 

ఆర్‌బీఐ తీసుకున్న వడ్డీ తగ్గింపు నిర్ణయం ఎంత త్వరగా వినియోగదారులకు ఉపయోగపడుతుందనేది బ్యాంకులు తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటుపై తీసుకున్న రుణాల వడ్డీ రేట్లను బ్యాంకులు తక్షణమే సవరించాల్సిన అవసరం ఉంది. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, బ్యాంకులు కనీసం మూడు నెలలకు ఒకసారి రుణాలపై సమీక్ష చేసి, తగిన నిర్ణయం తీసుకోవాలి.