Loan Waivers: రుణ మాఫీ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా రుణాలను మాఫీ చేయిస్తామంటూ సాగుతున్న తప్పుడు ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఇలాంటి మోసపూరిత హామీలతో ముందుకొచ్చే వ్యక్తులు, సంస్థలను పూర్తిగా దూరంగా ఉంచుకోవాలని సూచించింది. నేరుగా లేదా సామాజిక మాధ్యమాల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని కేంద్ర బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
వివరాలు
డిపాజిటర్ల ప్రయోజనాలు కూడా ప్రమాదంలో..
ఇదే అంశంపై 2023 డిసెంబర్‌లో కూడా హెచ్చరికలు జారీ చేసిన విషయాన్ని ఆర్ బి ఐ గుర్తు చేసింది. ఈ తరహా మోసాలు కేవలం ప్రజలకే కాదు, దేశంలోని రుణ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఆర్థిక సంస్థల స్థిరత్వం దెబ్బతినడంతో పాటు డిపాజిటర్ల ప్రయోజనాలు కూడా ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. అందువల్ల బ్యాంకులు లేదా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో ఉన్న బకాయిలను రద్దు చేయిస్తామంటూ చెప్పేవారిని నమ్మకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి వాగ్దానాలపై నమ్మకం ఉంచి ఎవరికి ఎటువంటి చెల్లింపులు చేయరాదని స్పష్టంగా పేర్కొంది. మాయమాటలతో ప్రజలను మోసం చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ హెచ్చరించింది.