Reserve Bank of India: బ్యాంకుల నుంచి రూ.3.93 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న ఆర్‌బీఐ.. అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగిపోతున్న అదనపు ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్ బి ఐ)చర్యలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా నిర్వహించిన 'వేరియబుల్ రేట్ రివర్స్ రెపో'(వీఆర్‌ఆర్‌ఆర్) వేలం ద్వారా రూ.3,93,352కోట్లను వెనక్కి తీసుకుంది. బ్యాంకుల వద్ద ఉన్న అదనపు నిధులను తగ్గించడం, మనీ మార్కెట్ రేట్లను రెపో రేటుకు అనుగుణంగా కొనసాగించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశం. తాజా వీఆర్‌ఆర్‌ఆర్ వేలం కోసం ఆర్‌బీఐ రూ.5లక్షల కోట్ల నోటిఫైడ్ మొత్తాన్ని ప్రకటించింది. అయితే బ్యాంకుల నుంచి రూ.3,93,352కోట్ల విలువైన బిడ్లు మాత్రమే వచ్చాయి. వచ్చిన అన్ని బిడ్లను ఆర్‌బీఐ ఆమోదించింది. ఈ నిధులను 5.24 శాతం కటాఫ్, వెయిటెడ్ యావరేజ్ రేటుతో స్వీకరించినట్లు ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
వివరాలు
ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ డిపాజిట్లతో పెరిగిన రూపాయి ద్రవ్యం
సెప్టెంబర్ 11 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో ద్రవ్య లభ్యత సుమారు రూ.10.73 లక్షల కోట్లుగా ఉన్నట్లు అంచనా.
దీంతో బ్యాంకుల వద్ద ఉన్న అదనపు నిధులను దశలవారీగా తగ్గించేందుకు కేంద్ర బ్యాంక్ చర్యలు చేపడుతోంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నగదు పెరగడానికి బ్యాంకులు ఇటీవల భారీగా సమీకరించిన ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్-బీ)డిపాజిట్లు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ డిపాజిట్ల ద్వారా సమీకరించిన విదేశీ కరెన్సీని బ్యాంకులు ఆర్‌బీఐతో స్వాప్ చేసుకోవడంతో వాటికి పెద్ద మొత్తంలో రూపాయి నిధులు అందుబాటులోకి వచ్చాయి.
ఈ అదనపు రూపాయి ద్రవ్యాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ గత నెల నుంచి వరుసగా వీఆర్‌ఆర్‌ఆర్ వేలాలను నిర్వహిస్తోంది.
వీటి ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలోని అదనపు లిక్విడిటీని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
వివరాలు
ఓఎంఓ ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల సెక్యూరిటీల విక్రయం
వీఆర్‌ఆర్‌ఆర్ వేలంతో పాటు అదనపు ద్రవ్య లభ్యతను మరింత సమర్థంగా నియంత్రించేందుకు ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) కింద రూ.1 లక్ష కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలను విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఈ అమ్మకాలు మూడు విడతల్లో జరగనున్నాయి.
సెప్టెంబర్ 17న తొలి విడతలో రూ.50,000 కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీల విక్రయం.
సెప్టెంబర్ 21న రెండో విడతలో రూ.25,000 కోట్ల విలువైన సెక్యూరిటీల విక్రయం.
సెప్టెంబర్ 28న మూడో విడతలో మరో రూ.25,000 కోట్ల విలువైన సెక్యూరిటీల విక్రయం.
వివరాలు
ఓఎంఓ ద్వారా మరో రూ.1 లక్ష కోట్ల సెక్యూరిటీల విక్రయం
ఇదే నెల ప్రారంభంలో నిర్వహించిన ఓవర్‌నైట్ వీఆర్‌ఆర్‌ఆర్ వేలం ద్వారా కూడా ఆర్‌బీఐ రూ.3.53 లక్షల కోట్లకు పైగా నిధులను సమీకరించింది.
తాజా చర్యలతో బ్యాంకింగ్ వ్యవస్థలో అదనపు నిధులను నియంత్రించడమే కాకుండా, స్వల్పకాలిక వడ్డీ రేట్లను లక్ష్య పరిధిలో కొనసాగించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది.