Reliance Jio: రిలయన్స్ భారీ ప్రణాళిక.. 1,650 శాటిలైట్లతో జియో బ్రాడ్‌బ్యాండ్!
ఈ వార్తాకథనం ఏంటి
దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్,డైరెక్ట్ టు డివైస్ సేవలను అందించేందుకు లో ఎర్త్ ఆర్బిట్ (ఎల్‌ఈఓ) శాటిలైట్ విభాగంలోకి అడుగుపెట్టి సొంత నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం,రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో భూమికి సుమారు 650 కిలోమీటర్ల ఎత్తులో 1,600 నుంచి 1,650 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది. వీటి ద్వారా వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలతో పాటు మొబైల్ ఫోన్లకు నేరుగా కనెక్టివిటీ అందించే డైరెక్ట్ టు డివైస్ సేవలను అందించాలని భావిస్తోంది.
వివరాలు
ఇన్-స్పేస్ కు ప్రతిపాదనలు
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి జియో ఇప్పటికే ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్)కు ప్రతిపాదనలు సమర్పించింది.
ప్రస్తుతం అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఈ ప్రాజెక్టుకు అనుమతి లభిస్తే, విదేశీ సంస్థల ఆధిపత్యం కొనసాగుతున్న ఎల్‌ఈఓ శాటిలైట్ రంగంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ జియో నిలవనుంది.
జాతీయ భద్రతా దృష్ట్యా విదేశీ శాటిలైట్ ఆపరేటర్లపై ఆధారపడటాన్ని తగ్గించాలని భారత్ భావిస్తోంది.
ఈ కారణంగానే ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ వంటి విదేశీ కంపెనీల కార్యకలాపాలపై ప్రభుత్వం కఠిన నిఘా కొనసాగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
వివరాలు
భారీ పెట్టుబడులు తప్పనిసరి
జియో ప్రతిపాదించిన శాటిలైట్ కాన్‌స్టెలేషన్ నిర్మాణానికి 10 నుంచి 15 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి అవసరమవుతుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.95 వేల కోట్ల నుంచి రూ.1.42 లక్షల కోట్ల వరకు ఉంటుంది.
ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే పలు టెరాబిట్‌ల హైస్పీడ్ డేటా సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
ఈ రంగానికి ఉన్న వ్యూహాత్మక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) ఫైలింగ్స్ ద్వారా జియోకు అవసరమైన ఆర్బిటల్ స్లాట్‌లు దక్కేలా కేంద్ర ప్రభుత్వం సహకరించే అవకాశాలు ఉన్నాయి.
భవిష్యత్తులో ఈ రంగంలోకి వచ్చే ఇతర భారతీయ కంపెనీలకూ ఇలాంటి మద్దతు అందించే అవకాశం ఉందని సమాచారం.
వివరాలు
జియో ప్లాట్‌ఫామ్స్ కింద కొత్త వ్యాపారం
శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సాంకేతిక విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
ఇదే సమయంలో జియో ప్లాట్‌ఫామ్స్‌ను పబ్లిక్ ఇష్యూకు తీసుకురావడానికి సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఎల్‌ఈఓ శాటిలైట్ రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది.
అమెజాన్ ప్రాజెక్ట్ కైపర్ మొత్తం 3,200 శాటిలైట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 300కు పైగా ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపింది.
యుటెల్‌శాట్ వన్‌వెబ్ ప్రస్తుతం 654 శాటిలైట్లతో సేవలు అందిస్తోంది. ఈ రంగంలో అత్యంత ప్రధాన సంస్థగా స్టార్‌లింక్ కొనసాగుతోంది.
ఈ పరిస్థితుల్లో జియో ప్రవేశం భారత శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.