Reliance Q4 FY26 Results: ఆదాయం పెరిగినా లాభం తగ్గింది.. రిలయన్స్ ఫలితాలతో ఇన్వెస్టర్లకు షాక్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ దిగ్గజ సంస్థ రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన నాలుగో త్రైమాసికం (Q4 FY26) ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో కంపెనీ ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ, నికర లాభంపై మాత్రం కొంత ఒత్తిడి కనిపించింది. ఇన్వెస్టర్లకు ఊరటనిస్తూ ప్రతి షేరుకు రూ.6 డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ కన్సోలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 13 శాతం తగ్గి రూ.16,971 కోట్లకు పరిమితమైంది. అయితే కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13 శాతం వృద్ధి చెంది రూ.2.98 లక్షల కోట్లకు చేరుకుంది.
వివరాలు
రంగాల వారీగా పనితీరు
టెలికాం విభాగంలో రిలయెన్స్ జియో తన దూకుడును కొనసాగించింది. జియో నికర లాభం రూ.7,022 కోట్ల నుంచి రూ.7,935 కోట్లకు పెరిగింది. సగటు వినియోగదారుడి ఆదాయం (ARPU) రూ.214కు పెరిగింది. మొత్తం యూజర్ల సంఖ్య 52.4 కోట్లు దాటగా, అందులో 26.8 కోట్ల మంది 5G వినియోగదారులు ఉండటం విశేషం. రిటైల్ విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. రిలయన్స్ రిటైల్ గ్రాస్ రెవెన్యూ 10.8 శాతం పెరిగి రూ.98,232 కోట్లకు చేరగా, నికర లాభం రూ.3,563 కోట్లుగా నమోదైంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఓమ్నీ-చానల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం వల్ల ఈ వృద్ధి సాధ్యమైందని సంస్థ పేర్కొంది.
వివరాలు
వినోద రంగలో అద్భుత ప్రయోజనాలు
ఆయిల్-టు-కెమికల్స్ విభాగం ఆదాయం 12 శాతం పెరిగి రూ.1.84 లక్షల కోట్లకు చేరినా, ఎబిటా 4 శాతం తగ్గి రూ.14,520 కోట్లుగా నమోదైంది. ఇక వినోద రంగంలో జియో స్టార్ విశేష ప్రగతిని సాధిస్తోంది. టీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో 34.2 శాతం వాటాతో 81 కోట్ల మంది ప్రేక్షకులను చేరుకుంది. ఇటీవల జరిగిన T20 వరల్డ్‌కప్ ఫైనల్‌ను ఏకకాలంలో 7.25 కోట్ల మంది వీక్షించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫలితాలపై స్పందించిన రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, జియో, రిటైల్ విభాగాలు అద్భుత పనితీరు కనబర్చాయని తెలిపారు. ముఖ్యంగా FMCG రంగంలో రిలయన్స్ బ్రాండ్లు వేగంగా విస్తరిస్తున్నాయని, దేశంలో వినియోగం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నారు.