RIL: తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు @రూ.20లక్షల కోట్లు
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) సరికొత్త రికార్డును సృష్టించింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారానికి రూ.20 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఇంత మొత్తంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ లక్ష్యాన్ని అధిగమించిన తొలి లిస్టెడ్ భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అవతరించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ముకేష్ అంబానీ కంపెనీ రూ.20 లక్షల కోట్లకు చేరుకోవడంతో ఆయన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 11వ స్థానానికి చేరుకున్నాడు. స్టాక్ మార్కెట్‌లో రిలయన్స్ షేర్లు మంగళవారం భారీగా పెరిగాయి. ఆర్‌ఐఎల్ షేర్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ)లో 1.89% పెరిగి 52 వారాల గరిష్ట స్థాయికి చేరాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంది.
రెండు వారాల్లో రూ.లక్ష కోట్లు సంపాదించిన అంబానీ
రిలయన్స్ గ్రూప్ ఆగస్టు 2005లో రూ. 1 లక్ష కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను సాధించింది. నవంబర్ 2019 నాటికి రూ. 10లక్షల కోట్లకు చేరుకుంది. కేవలం ఐదేళ్లలోనే రూ. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో సరికొత్త రికార్డును సృష్టించింది. రిలయన్స్ తర్వాత టీసీఎస్ (రూ.15లక్షల కోట్లు), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (రూ.10.5లక్షల కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.7లక్షల కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.7లక్షల కోట్లు) ఉన్నాయి. 2024జనవరి నుంచి ముఖేష్ అంబానీ నికర విలువ విపరీతమైన వృద్ధిని సాధించింది. కేవలం ఒకటిన్నర నెలల్లో 12.9బిలియన్ డాలర్లను అంబానీ ఆర్జించారు. ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 బిలియనీర్లలో అంబానీ ఒకరు కావడం గమనార్హం. గత రెండు వారాల్లోనే ఆర్‌ఐఎల్ మార్కెట్ విలువ రూ.లక్ష కోట్లు పెరిగింది.