Russian Oil: 100 డాలర్ల దిగువన చమురు ధరలు: రష్యా చమురుకు తాత్కాలిక గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా ఎగబాకాయి. అయితే ఆ పెరుగుదలకు అమెరికా తీసుకున్న తాజా నిర్ణయం కొంత మేర బ్రేక్ వేసినట్టైంది. సముద్రంలో రవాణా మధ్యలో నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేయడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ 30 రోజుల తాత్కాలిక సడలింపు (వైవర్) ఇచ్చింది. ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో సరఫరాపై ఉన్న ఆందోళనలు కొంత తగ్గి, చమురు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో బ్రెంట్ క్రూడ్ ధర 0.47 శాతం తగ్గి బ్యారెల్‌కు 99.99 డాలర్ల వద్ద నమోదైంది.
వివరాలు
అమెరికా ఇచ్చిన సడలింపు ఏమిటి?
అదే సమయంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ధర 0.67 శాతం పడిపోయి బ్యారెల్‌కు 95.09 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే ఇరాన్ దాడుల భయం, హార్ముజ్ జలసంధి మూసివేతపై ఉన్న అనిశ్చితి కారణంగా ధరలు పెద్దగా పడిపోలేదు. మార్చి 12లోపు నౌకల్లో లోడ్ చేసి ఇప్పటికే సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు అమెరికా 30 రోజుల పాటు అనుమతి ఇచ్చింది. మార్చి 5 నాటికి ఓడల్లో ఉన్న చమురును కొనుగోలు చేయడానికి వారం రోజుల క్రితం భారత్‌కు మాత్రమే ప్రత్యేక అనుమతి ఇచ్చిన అమెరికా, ఇప్పుడు అదే వెసులుబాటును ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తింపజేసింది.
వివరాలు
రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా పెరగడానికి, సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడి చమురును కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి ఇస్తున్నామని అమెరికా తెలిపింది. ఇది ఇప్పటికే రవాణాలో ఉన్న చమురుకు మాత్రమే వర్తిస్తుందని, అందువల్ల రష్యా ప్రభుత్వానికి పెద్దగా ఆర్థిక లాభం ఉండదని పేర్కొంది. ప్రస్తుతం కనిపిస్తున్న చమురు ధరల పెరుగుదల తాత్కాలికమేనని, దీర్ఘకాలంలో ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఎక్స్ (X) వేదికగా వెల్లడించారు.
వివరాలు
హార్ముజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తత
అమెరికా నిర్ణయంతో ఒకవైపు చమురు ధరలు కొద్దిగా తగ్గినా, మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్న హెచ్చరికలు మార్కెట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన అత్యంత కీలక మార్గమైన హార్ముజ్ జలసంధిని తాము మూసివేయడం కొనసాగిస్తామని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పష్టం చేశారు. ఈ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికా ఇప్పటికే తన వ్యూహాత్మక చమురు నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెళ్లను విడుదల చేసింది. అంతర్జాతీయ ఇంధన సంస్థ (IEA) కూడా మార్కెట్లోకి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది. మరోవైపు ఇరాక్, కువైట్ వంటి దేశాల్లో నిల్వకు స్థలం లేకపోవడంతో చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గిస్తున్నాయి.
వివరాలు
భారత్‌పై పడే ప్రభావం ఇదే..
ఎస్ అండ్ పీ గ్లోబల్ ఎనర్జీ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఇరాక్ ఇప్పటికే రోజుకు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని నిలిపివేసింది. భారత్ తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో జరిగే చిన్న మార్పు కూడా భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ముడి చమురు ధర బ్యారెల్‌కు కేవలం 1 డాలర్ పెరిగి అది ఏడాది పాటు అలాగే కొనసాగితే, భారత దిగుమతుల బిల్లు సుమారు ₹16,000 కోట్లు పెరిగే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
వివరాలు
భారత్‌పై పడే ప్రభావం ఇదే..
దీని వల్ల దేశ కరెంట్ ఖాతా లోటు (CAD) పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం కూడా పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పటికే సముద్ర రవాణాలో అంతరాయాల కారణంగా ముంబై సహా పలు నగరాల్లో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడి రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చమురు ధరలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రవాణా ఖర్చులు, ఎరువుల ధరలు, వంటగ్యాస్ ధరలు పెరిగి సాధారణ ప్రజలపై అదనపు భారం పడే అవకాశముంది.