Bhavish Aggarwal: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ కృత్రిమ్ ఏఐలో ఓలా గ్రూప్ రూ.2వేల కోట్లు పెట్టుబడులు
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్ తన కృత్రిమ మేధ సంస్థ 'కృత్రిమ్ ఏఐ'లో పెట్టుబడులను దశల వారీగా పెంచుతున్నారు.
తాజాగా, ఈ స్టార్టప్‌లో రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. వచ్చే ఏడాది నాటికి ఈ పెట్టుబడిని రూ.10,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
ఈ విషయాన్ని అగర్వాల్ 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. కృత్రిమ మేధా సాంకేతికతను మరింత మెరుగుపర్చేందుకు కొత్త ఏఐ ల్యాబ్‌ను ప్రారంభించినట్టు తెలిపారు.
వివరాలు
భారత్ తొలి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ 'కృత్రిమ్-1'
భారతదేశానికి అనుకూలంగా ఏఐని అభివృద్ధి చేయడంపై తన ప్రత్యేక దృష్టి ఉందని అగర్వాల్ తెలిపారు.
గత ఏడాది నుండి కృత్రిమ మేధపై పనిచేస్తున్నామని, దేశీయ భాషలు, డేటా కొరత వంటి సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే భారత్ తొలి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ 'కృత్రిమ్-1'ను ప్రారంభించింది.
ఇది బేసిక్ 7B మోడల్ కాగా, మరింత మెరుగైన 'కృత్రిమ్-2'ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అలాగే, విజన్ లాంగ్వేజ్ మోడల్ 'చిత్రార్థ్-1' స్పీచ్ ప్రాసెసింగ్ కోసం 'ధ్వని-1'ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మోడళ్లు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, తమిళం, మరాఠీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా, అస్సామీ భాషలకు మద్దతునివ్వనున్నాయి.
వివరాలు
కృత్రిమ్ ఏఐ'ను 2023లో స్థాపించారు
ప్రపంచం ప్రస్తుతం అమెరికా,చైనా అభివృద్ధి చేసిన కృత్రిమ మేధా మోడళ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ,భారత్ నుంచి స్వంతంగా ఓ ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో,దేశంలో తొలి'GB200 AI'సూపర్ కంప్యూటర్‌ను ఎన్విడియా భాగస్వామ్యంతో తీసుకురావడానికి 'కృత్రిమ్' ప్రయత్నిస్తోంది.
ఇది వచ్చే మార్చిలో అందుబాటులోకి రానుంది.అలాగే, క్లౌడ్ ఆధారిత ఏఐ సేవ 'కృత్రిమ్ క్లౌడ్'ను కూడా కంపెనీ ప్రారంభించినట్టు అగర్వాల్ తెలిపారు.
'కృత్రిమ్ ఏఐ'ను 2023లో స్థాపించారు.ఇప్పటికే వెంచర్ క్యాపిటల్ ఫండ్ మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా సహా ఇతర పెట్టుబడిదారుల నుంచి 50 మిలియన్ డాలర్లు సమీకరించుకుంది.
ఈ కారణంగా 2024లో భారత్ తొలి యూనికార్న్‌గా మారింది.అలాగే,బిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరిన తొలి భారతీయ ఏఐ సంస్థగా నిలిచింది.