RBI: రూ.2 వేల నోటు ఎక్స్ఛేంజ్,డిపాజిట్ పై ఆర్‌బీఐ కీలక ప్రకటన
రూ. 2000 నోట్ల మార్పిడికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక సమాచారాన్ని తెలియజేసింది. ఖాతాల వార్షిక ముగింపు కారణంగా ఏప్రిల్ 1న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి వీలు ఉండదని పేర్కొంది. ఈ సదుపాయం మంగళవారం(ఏప్రిల్ 2)నుంచి పునఃప్రారంభం అవుతుందని సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. మే 19, 2023 నుండి ఆర్బీఐ 19ఇష్యూ కార్యాలయాల్లో రూ. 2000 నోట్ల మార్పిడికి అనుమతిస్తోంది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఆర్ బి ఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి.
రూ. 2,000 నోట్ల మొత్తం విలువలో 97.6 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి..
ఆర్‌బీఐ గత సంవత్సరం అక్టోబరు నుంచి ఖాతాదారులు రూ.2000 నోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు స్వీకరిస్తోంది. 2023 మే 19 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువలో 97.6 శాతం తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చింది. బ్యాంకుల్లో రూ.2000 నోట్లను మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి ప్రజలకు చివరి రోజు అక్టోబర్ 7. RBI నోట్లను ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన తేదీ మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఫిబ్రవరి 29 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గిందని ఆర్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.