
RBI data: రెండేళ్లయినా రూ.6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణీలోనే..
ఈ వార్తాకథనం ఏంటి
పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ.2000 నోట్లు మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవడం ప్రారంభించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా,ఇంకా వాటిలో ₹6,266 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది.
ఇప్పటివరకు మొత్తం రూ.2000 నోట్లలో 98.24 శాతం తిరిగి వచ్చాయని, మిగిలినవి ఇంకా అందుకోలేదని వెల్లడించింది.
అయితే, ఇవి చట్టపరమైన చెల్లుబాటయ్యే నోట్లుగానే కొనసాగుతాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
2023 మే 19న,చలామణీలో ఉన్న రూ.2000 నోట్లను నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.
ఆ సమయానికి మార్కెట్‌లో మొత్తం రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో జమ చేసే అవకాశం
ప్రజలకు ఈ నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి ఆర్‌బీఐ 2023 అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పించింది.
ఆ తరువాత నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్లను జమ చేసే అవకాశాన్ని కల్పించింది.
ఇలా అనుసరించిన ప్రక్రియలో 2025 ఏప్రిల్ 30 నాటికి ₹6,266 కోట్ల విలువైన రూ.2000 నోట్లు మాత్రమే ఇంకా తిరిగి రాలేదని ఆర్ బి ఐ వెల్లడించింది.
అయితే, రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాలకు వ్యక్తిగతంగా వెళ్లలేని వారు పోస్టాఫీసు సేవల ద్వారా ఈ నోట్లను పంపించి, వాటి విలువను తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకోవచ్చని సూచించింది.