Rupee Value: డాలర్ దెబ్బకు రూపాయి కుదేలు.. తొలిసారి రూ.96 దాటిన విలువ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా డాలర్ విలువ తొలిసారి రూ.96 మార్కును దాటింది. గురువారం జరిగిన లావాదేవీల్లో రూపాయి విలువ 95.96 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకోగా, శుక్రవారం మధ్యాహ్నం 96.07 వద్ద మరోసారి దిగజారింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో రూపాయిపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. రూపాయి బలహీనపడటంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా వంట నూనెలు, ముడి చమురు, సహజ వాయువు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం, విలాసవంతమైన కార్లు, ఖరీదైన గడియారాల ధరలు పెరగనున్నాయి.
వివరాలు
ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం
దీని ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా పెరిగి సామాన్య ప్రజలపై అదనపు భారం పడే పరిస్థితి ఏర్పడుతోంది. ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గే ప్రమాదం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం పిల్లలను పంపిన కుటుంబాలపై ఖర్చుల భారం మరింత పెరుగుతుంది. అయితే మరోవైపు భారత్ నుంచి వస్తువులు, సేవలు విదేశాలకు ఎగుమతి చేసే సంస్థలకు మాత్రం రూపాయి పతనం కొంత మేర లాభదాయకంగా మారనుంది.