LOADING...
OAG: టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గని రద్దీ.. శ్రీనగర్‌కు అదనపు విమానాలు
టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గని రద్దీ.. శ్రీనగర్‌కు అదనపు విమానాలు

OAG: టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా తగ్గని రద్దీ.. శ్రీనగర్‌కు అదనపు విమానాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో దేశీయ విమానయాన సంస్థలు శ్రీనగర్, లండన్ మార్గాల్లో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చాయి. విమాన టికెట్ ధరలు గణనీయంగా పెరిగినా, ఈ గమ్యస్థానాలపై డిమాండ్ మాత్రం తగ్గలేదని గ్లోబల్ ఏవియేషన్ డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫామ్ ఓఏజీ (OAG) తాజా గణాంకాలు వెల్లడించాయి. వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రాంతాలకు ప్రయాణించాలనే ఆసక్తి సహజంగానే పెరుగుతుందని నివేదిక పేర్కొంది. కశ్మీర్‌లో పరిస్థితులు కుదుటపడటంతో ఈసారి దేశీయంగా శ్రీనగర్‌కు విమాన ప్రయాణాలు గణనీయంగా పెరిగాయి.

వివరాలు

40శాతం వరకు ఛార్జీల పెంపు

దిల్లీ-శ్రీనగర్ మార్గంలో ఎయిరిండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్ కలిసి ఈ నెలలో గతేడాది ఇదే నెలతో పోలిస్తే 2 లక్షలకు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఈ మార్గంలో సీట్ల సామర్థ్యం 35 శాతం పెరిగింది. కొన్ని రోజుల్లో ఈ మార్గంలో విమాన ఛార్జీలు 40 శాతం వరకు పెరిగినట్లు సమాచారం. రద్దీ పరంగా చూస్తే ఈ నెలలో దిల్లీ-శ్రీనగర్ మార్గం దేశంలోనే 9వ అత్యంత రద్దీ మార్గంగా నిలిచింది.

వివరాలు

అంతర్జాతీయ ప్రయాణాలపై ప్రభావం

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధనం (ATF) ధరలు రెండింతలు పెరగడంతో అంతర్జాతీయ టికెట్ ధరలపై ప్రభావం పడింది. దీంతో కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో డిమాండ్ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో విమానయాన సంస్థలు పశ్చిమాసియా మార్గాల నుంచి విమానాలను లండన్ మార్గానికి మళ్లించాయి. ఈ నేపథ్యంలో 2025 జూన్‌తో పోలిస్తే దిల్లీ-లండన్ హీత్రూ మార్గంలో 15 శాతం అదనపు సీట్లు, ముంబయి-లండన్ హీత్రూ మార్గంలో 12 శాతం అదనపు సీట్లు పెరిగాయి.

Advertisement

వివరాలు

గల్ఫ్ దేశాల సంస్థల ధరలు 15 శాతం పెంపు

దిల్లీ-లండన్ మార్గంలో భారత విమానయాన సంస్థల టికెట్ ధరలు 35 శాతం అధికంగా ఉండగా, గల్ఫ్ దేశాల సంస్థల ధరలు 15 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ముంబయి-దుబాయ్ మార్గంలో సీట్ల సామర్థ్యం 10 శాతం తగ్గింది. అయినప్పటికీ 2.1 లక్షల సీట్లతో ఇది ఇప్పటికీ భారత్ నుంచి అత్యంత రద్దీగా ఉన్న అంతర్జాతీయ మార్గంగా కొనసాగుతోంది. ఈ మార్గంలో విమాన ఛార్జీలు 10-15 శాతం వరకు పెరిగాయి. అబుదాబి-ముంబయి మార్గంలో డిమాండ్ సాధారణంగా ఉండటంతో సీట్ల సామర్థ్యం 18 శాతం తగ్గి లక్ష సీట్లకు చేరుకుంది.

Advertisement

వివరాలు

దేశీయంగా అత్యంత రద్దీ మార్గాలు

దేశంలో అత్యంత రద్దీ మార్గంగా ముంబయి-దిల్లీ కొనసాగుతోంది. ఈ మార్గంలో 6.58 లక్షల సీట్లు (9 శాతం వృద్ధి) నమోదయ్యాయి. రెండో స్థానంలో బెంగళూరు-దిల్లీ మార్గం ఉంది, ఇందులో 4.31 లక్షల సీట్లు ఉన్నాయి. బెంగళూరు-దిల్లీ, బెంగళూరు-ముంబయి వంటి మెట్రో మార్గాల్లో విమాన టికెట్ ధరలు ఇప్పటికీ 15-20 శాతం అధికంగానే కొనసాగుతున్నాయి. అయితే ఎయిరిండియా, ఇండిగో సర్వీసులు తగ్గించినప్పటికీ బెంగళూరు-హైదరాబాద్ మార్గంలో మాత్రం టికెట్ ధరలు కొంత తగ్గుముఖం పట్టినట్లు సమాచారం.

Advertisement