Russia: భారత్‌కు 9.5 మిలియన్ బారెల్ల చమురు పంపేందుకు రష్యా సిద్ధం.. సరఫరా సంక్షోభం నేపథ్యంలో కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి భారత్‌కు 9.5 మిలియన్ బారెల్స్ చమురు పంపేందుకు సిద్ధం అని సమాచారం వెలువడింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న సంఘర్షణల కారణంగా చమురు సరఫరా అంతరాయం ఏర్పడుతున్న నేపథ్యంలో, భారత్‌కు అవసరమైన చమురును మళ్లించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత సముద్ర సరిహద్దుల దగ్గర ఇప్పటికే సుమారు 9.5 మిలియన్ బారెల్స్ రష్యన్ క్రూడ్ ఆయిల్‌తో నౌకలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే కొన్ని వారాల్లోనే భారత్‌కు చేరే అవకాశం ఉందని రాయిటర్స్‌కు ఓ పరిశ్రమ వర్గం తెలిపింది. ఈ నౌకలు మొదట ఎక్కడికి వెళ్లాల్సి ఉందో వెల్లడించడానికి మాత్రం ఆ వర్గం నిరాకరించింది.
వివరాలు
ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను వెతుకుతున్న ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌కు చమురు సరఫరాలో చిన్న అంతరాయం వచ్చినా పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ప్రస్తుతం ఉన్న క్రూడ్ ఆయిల్ నిల్వలు సుమారు 25 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతాయని అంచనా. అదే సమయంలో డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ వంటి ఇంధనాల నిల్వలు కూడా పరిమితంగానే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని, భారత్ 10 నుంచి 15 రోజుల్లో ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను వెతుకుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వివరాలు
భారత్‌కు వచ్చే మొత్తం చమురు దిగుమతుల్లో 40 శాతం ఈ మార్గం ద్వారానే..
మరోవైపు ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు మార్గంగా గుర్తింపు పొందిన హోర్ముజ్ జలసంధి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది. భారత్‌కు వచ్చే మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 40 శాతం ఈ మార్గం ద్వారానే వస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత ఇరాన్ ప్రతిదాడులు ప్రారంభించడంతో ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై దాడులు జరిగాయి. దీంతో ఈ మార్గం దాదాపు మూసుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగ దేశమైన భారత్ ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.
వివరాలు
భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40శాతం వరకు సరఫరా: రష్యా
ప్రస్తుతం భారత రిఫైనరీలు రోజుకు సుమారు 5.6మిలియన్ బారెల్స్ చమురును ప్రాసెస్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో రష్యా భారత్‌కు అవసరమైన చమురులో దాదాపు 40శాతం వరకు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు,ప్రభుత్వ మార్గదర్శకాలు ఆధారంగా మాత్రమే రష్యా నుంచి చమురు కొనుగోలు పెంపు విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని రిఫైనరీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉండగా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత నుంచి రష్యా చమురు ప్రపంచ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు విక్రయమవుతోంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో చమురు మార్కెట్ అమ్మకందారుల ఆధిపత్యంలోకి మారిందని, అందువల్ల ఆతగ్గింపు కూడా తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
వివరాలు
చమురు దిగుమతులపై భారత్, చైనా ఆధారం
మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రధాన సరఫరాదారు అయిన ఖతార్ ఉత్పత్తి నిలిపివేయడంతో,రష్యా నుంచి ద్రవీభవించిన సహజ వాయువు (LNG) కూడా భారత్‌కు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ప్రస్తుతం కొరతను ఎదుర్కొనేందుకు భారత కంపెనీలు కొంతమంది పారిశ్రామిక వినియోగదారులకు గ్యాస్ సరఫరాను తగ్గించినట్లు సమాచారం. మధ్యప్రాచ్య దేశాల నుంచి చమురు దిగుమతులపై భారత్, చైనా రెండూ అధికంగా ఆధారపడుతున్నాయి.
వివరాలు
చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం భద్రత
అయితే చైనాతో పోలిస్తే భారత్ వద్ద నిల్వలు తక్కువగా ఉండటంతో, ఇలాంటి ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం భారత్‌పై ఎక్కువగా పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇక పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారితే హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే చమురు ట్యాంకర్లకు అమెరికా నౌకాదళం భద్రత కల్పించవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే గల్ఫ్ ప్రాంతంలో నౌకాయానానికి రాజకీయ ప్రమాద బీమా, హామీలు అందించేందుకు అమెరికా సంస్థలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.