Oil imports: రష్యా నుంచే భారత్‌కు 50 శాతానికి పైగా చమురు దిగుమతులు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు పరిమాణం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకుంది. జూలైలో భారత్ మొత్తం దిగుమతి చేసుకున్న చమురులో రష్యా వాటా ఏకంగా 50.83 శాతానికి చేరింది. అంటే రోజుకు సగటున 24.7 లక్షల బ్యారెళ్ల (2.47 మిలియన్ బ్యారెళ్ల) ముడి చమురును రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 62.4 శాతం పెరుగుదల. అయితే జూన్‌లో నమోదైన రికార్డు స్థాయి రోజువారీ 26 లక్షల బ్యారెళ్ల దిగుమతులతో పోలిస్తే జూలైలో కొంత తగ్గింది. వాణిజ్య వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా చమురుపై భారత్ ఆధారపడటం మరింత పెరిగింది.
వివరాలు
రష్యా చమురుపై అమెరికా టారిఫ్‌లతో అనిశ్చితి
అమెరికా విధించే అధిక సుంకాలను తప్పించుకునేందుకు భారతీయ రిఫైనరీలు జనవరిలో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించడం ప్రారంభించాయి.
న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగానే ఈ చర్యలు చేపట్టారు.
అయితే ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో భారతీయ రిఫైనరీలు మళ్లీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించాల్సి వచ్చింది.
ఇప్పుడు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లపై మరోసారి అనిశ్చితి నెలకొంది. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం టారిఫ్ విధించేలా అమెరికా సెనేట్ చట్టాన్ని ఆమోదించింది.
దీంతో భారత్ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
వివరాలు
రష్యా చమురు దిగుమతుల్లో భారీ పెరుగుదల
భారత్ ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా గతేడాది సుమారు 37 శాతంగా ఉండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో అది రికార్డు స్థాయిలో 43.25 శాతానికి పెరిగింది.
ఇదే సమయంలో లాటిన్ అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురు వాటా కూడా పెరిగింది.
గతేడాది 3.5 శాతంగా ఉన్న లాటిన్ అమెరికా వాటా ప్రస్తుతం 12.7 శాతానికి చేరుకుంది.
బ్రెజిల్, వెనిజులా నుంచి దిగుమతులు పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిణామాలు చమురు వాణిజ్య తీరును ఎలా మారుస్తున్నాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మార్పుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది.