 
                                                                                Rybelsus: గుండెపోటు, స్ట్రోక్ నివారణకు 'రైబెల్సస్' మందుకు ఎఫ్డీఏ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
వైద్యరంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గుండెపోటు,స్ట్రోక్ వంటి తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే లక్ష్యంతో 'రైబెల్సస్' (Rybelsus) అనే ఔషధానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) తాజాగా ఆమోదం తెలిపింది. నోటి ద్వారా తీసుకునే (ఓరల్) మొట్టమొదటి GLP-1 రిసెప్టర్ ఆగోనిస్ట్ మందుగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. ఇప్పటివరకు ఈ ఔషధాన్ని టైప్-2 మధుమేహ రోగులలో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి వాడుతుండగా, ఇప్పుడు దీని ప్రయోజనాలను హృద్రోగాల నివారణకు కూడా విస్తరించారు. సూదులు లేకుండా మాత్ర రూపంలో అందుబాటులో ఉండటం వల్ల, ఇది గుండె ఆరోగ్య సంరక్షణలో ఒక ప్రముఖ ముందడుగుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
రైబెల్సస్ ఎలా పనిచేస్తుంది?
'రైబెల్సస్' లేదా ఓరల్ సెమాగ్లూటైడ్, మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే GLP-1 హార్మోన్ ప్రభావాన్ని అనుకరిస్తూ పనిచేస్తుంది. ఈ హార్మోన్ రక్తంలో చక్కెర స్థాయిని, ఆకలిని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదనంగా, ఇది గుండెపోటుకు దారితీసే రక్తనాళాల వాపు (ఆర్టీరియల్ ఇన్‌ఫ్లమేషన్), ఆక్సిడేటివ్ స్ట్రెస్ వంటి హానికర పరిస్థితులను తగ్గిస్తుంది. దీని ఫలితంగా రక్తనాళాల్లో కొవ్వు ఫలకాలు (అథెరోస్క్లెరోసిస్) పేరుకుపోకుండా అడ్డుకోవడంతో పాటు, గుండెకు సమగ్ర రక్షణ కల్పిస్తుంది. అంతేకాక, రక్తప్రవాహాన్ని మెరుగుపరచడం, చెడు కొలెస్ట్రాల్ (LDL) మరియు ట్రైగ్లిసరైడ్ల స్థాయిలను తగ్గించడం వంటి అదనపు లాభాలను కూడా అందిస్తుంది.
వివరాలు
మాత్ర, ఇంజెక్షన్ మధ్య తేడాలు
'రైబెల్సస్' ఇంజెక్షన్ రూపంలో కూడా 'ఓజెంపిక్'(Ozempic)అనే పేరుతో అందుబాటులో ఉంది. రెండు మందులలోనూ ఒకే క్రియాశీల పదార్థం ఉన్నప్పటికీ,శరీరంలో అవి పని చేసే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇంజెక్షన్ నేరుగా రక్తప్రవాహంలోకి చేరే కారణంగా తక్కువ మోతాదుతోనే ప్రభావం చూపుతుంది. కానీ మాత్ర రూపంలో తీసుకున్నప్పుడు,మందులోని కొంత భాగం జీర్ణక్రియలో విచ్ఛిన్నమవుతుంది, అందువల్ల అదే ప్రభావం కోసం కొంచెం ఎక్కువ మోతాదు అవసరం అవుతుంది. ఈ కారణంగా,మందు మొదలుపెట్టిన తొలి రోజుల్లో వికారం,కడుపు ఉబ్బరం,జీర్ణ సమస్యలు వంటి తాత్కాలిక దుష్ప్రభావాలు కొందరిలో కనిపించవచ్చు. వైద్యుల సూచన ప్రకారం,ఈ మాత్రను ఉదయం ఖాళీ కడుపుతో,కేవలం నీటితో మాత్రమే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కనీసం 30నిమిషాల పాటు ఆహారం లేదా ఇతర మందులు తీసుకోరాదు.
వివరాలు
ప్రయోజనాలు, దుష్ప్రభావాలు
'రైబెల్సస్' రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడమే కాకుండా, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీని వలన రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడి, గుండె సంబంధ వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. క్లినికల్ పరిశోధనల్లో ఈ మందు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రధాన హృదయ సంబంధ ప్రమాదాలను తగ్గించగలదని తేలింది. ప్రారంభ దశలో కొంతమంది రోగులలో వికారం, మలబద్ధకం, డయేరియా, కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలు తాత్కాలికంగా కనిపించవచ్చు. అయితే, శరీరం మందుకు అలవాటు పడిన తరువాత ఇవి స్వయంగా తగ్గిపోతాయి. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితిలో, 'రైబెల్సస్'కు FDA ముద్ర లభించడం వైద్య రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తున్నారు.