LOADING...
Samsung: శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్
శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

Samsung: శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది. దీంతో భారీ స్థాయిలో మెమొరీ చిప్‌లకు డిమాండ్‌ ఏర్పడుతోంది. ఈ పరిస్థితుల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ చిప్‌ విభాగం అనూహ్య లాభాలను నమోదు చేసింది. గత త్రైమాసికంలో ఆదాయం 49 రెట్లు పెరగడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. చిప్‌ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు రూ.3.25 కోట్ల మేర భారీ ప్రోత్సాహక నగదు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంస్థ పాలక మండలి కూడా అనుమతి తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఆ విభాగంలోని వేలాది మంది ఉద్యోగులు కోటీశ్వరుల జాబితాలో చేరనున్నారు.

వివరాలు 

భారీ బోనస్ వెనుక కారణాలు

ఈ భారీ ప్రోత్సాహక నగదు వెనుక కేవలం లాభాల పెరుగుదల మాత్రమే కాకుండా, ఉద్యోగుల ఆందోళన కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు, వేతనాల పెంపు వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ చిప్‌ విభాగ ఉద్యోగులు ఇటీవల సమ్మె హెచ్చరిక జారీ చేశారు. తమ డిమాండ్లు పట్టించుకోకపోతే 18 రోజులపాటు సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. అయితే సెమీకండక్టర్ చిప్‌ల తయారీలో ఒక్కరోజు అంతరాయం వచ్చినా సంస్థకు వేల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

వివరాలు 

ఉద్యోగుల సంఘంతో చర్చలు

అంతేకాక ప్రపంచ సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సంస్థ యాజమాన్యం ఉద్యోగుల సంఘంతో చర్చలు జరిపి ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. ఆ ఒప్పందంలో భాగంగానే చిప్‌ విభాగంలోని సుమారు 78 వేల మంది ఉద్యోగులకు భారీ ప్రోత్సాహక నగదు అందించనున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో ప్రముఖ మెమరీ చిప్‌ల తయారీ సంస్థ ఎస్‌కే హైనిక్స్‌ కూడా గత ఏడాది పెరిగిన వ్యాపార లాభాల ఆధారంగా ఉద్యోగులకు ప్రత్యేక బోనస్'లు ప్రకటించింది.

Advertisement