కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసింది: ఎస్‌బీఐ
కరెన్సీ చలామణిని యూపీఐ సమర్థవంతంగా భర్తీ చేసిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక నివేదికను విడుదల చేసింది. సెమీ-అర్బన్ ప్రాంతాల్లో లావాదేవీల విలువలో యూపీఐ మూడింట ఒక వంతు వాటాను కలిగి ఉన్నట్లు ఎస్‌బీఐ చెప్పింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, మధ్యప్రదేశ్, గుజరాత్, అస్సాం, హర్యానాలోని 15 రాష్ట్రాలు దాదాపు 90మంది శాతం వాటాను కలిగి ఉన్నట్లు వివరించింది. ఈ 15 రాష్ట్రాల సగటు రూ. 1,600-2,000 మధ్య ఉన్నట్లు ఎస్‌బీఐ చెప్పింది.
100 జిల్లాల్లోనే 45 శాతం యూపీఐ లావాదేవీలు
పర్సన్ టు మర్చంట్ విభాగంలో 67 శాతం, పర్సన్ టు పర్సన్ సెగ్మెంట్‌లో 87శాతం యూపీఐ లావాదేవీలు రూ.2,000 కంటే ఎక్కువని ఎస్‌బీఐ పేర్కొంది. యూపీఐ విలువ/వాల్యూమ్‌లో టాప్ 100 జిల్లాలు 45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తం విలువలో మెట్రో నగరాలు 20 శాతం వాటాను కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు 20 శాతం, గ్రామీణ ప్రాంతాలు 25 శాతం, సెమీ అర్బన్ ప్రాంతాలు 35 శాతం వాటాను కలిగి ఉన్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మొత్తం 8,840 కోట్ల ఆర్థిక డిజిటల్ లావాదేవీల్లో 52 శాతం యూపీఐదేనని ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఆర్థిక సర్వే 2023 పేర్కొంది.