
SBI : గ్రామీణాభివృద్ధికి ఎస్‌బీఐ భారీ నిర్ణయం.. CSR కింద రూ.610 కోట్లు ఖర్చు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది. 'సోలార్ రూఫ్‌టాప్' కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ చర్యలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 40 లక్షల(4 మిలియన్లు)ఇళ్లకు సోలార్ విద్యుత్ అందించేందుకు సిద్ధమవుతోందని వెల్లడించింది. ఈ ప్రకటనను ఎస్‌బీఐ 70 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా చేసింది. భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న నెట్ జీరో 2070 దిశగా మద్దతుగా, పునరుత్పాదక ఇంధన మార్గంలో ప్రధాన పాత్ర పోషించాలన్న ఉద్దేశంతో ఈ ప్రణాళికను రూపొందించినట్టు పేర్కొంది. భారత్ పునరుత్పాదక ఇంధన దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో, సోలార్ రూఫ్‌టాప్ ప్రోగ్రాం కీలకమైన అడుగు అని ఎస్‌బీఐ స్పష్టం చేసింది.
Details
వివిధ రంగాల్లో అభివృద్ధికి తోడ్పాటు
గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) వ్యవసాయ రుణాల పరంగా రూ. 3.5 లక్షల కోట్లను మించిందని ఎస్‌బీఐ ప్రకటించింది. ఇది దేశంలో అత్యధికం కావడం గమనార్హం. వ్యవసాయ మౌలిక సదుపాయాల బలోపేతానికి, FPOలు, పరిశ్రమలు, కోఆపరేటివ్‌లకు నిధులు అందజేయడం ద్వారా గ్రామీణ అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు తెలిపింది. CSR కార్యక్రమాల్లో రూ. 610.80 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 94 జిల్లాల్లో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాయని పేర్కొంది. కావేరీ నది పరివాహక ప్రాంతాల్లో 9 లక్షల మొక్కలు నాటినట్లు వివరించింది. పేద విద్యార్థులు, దివ్యాంగుల కోసం అనేక అభివృద్ధి ప్రాజెక్టులూ చేపట్టినట్టు తెలిపింది.
Details
భవిష్యత్ వ్యాపారాలపై దృష్టి
ఎస్‌బీఐ ప్రకారం, పునరుత్పాదక ఇంధనంతోపాటు ఇ-మొబిలిటీ, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, స్మార్ట్ ఇన్‌ఫ్రా రంగాలకు రుణాల మంజూరులో ముందంజ వేస్తోంది. ఈ రుణాలు వేగంగా ఆమోదించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.
Details
పీఎం సూర్య ఘర్ యోజనలో భాగస్వామ్యం
భారత ప్రభుత్వ 'పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' ప్రకారం ఇంటి మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుచేసి, నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు పొందొచ్చు. మిగిలిన విద్యుత్తును ఇతరులకు విక్రయించి ఆదాయంగా మలచుకోవచ్చు. కేంద్రం రూ.78,000 వరకు సబ్సిడీను అందిస్తోంది. ఈ పథకాన్ని మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఎస్‌బీఐ కీలక భాగస్వామిగా మారనుంది. మొత్తం మీద, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా, దేశ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరే దిశగా ఎస్‌బీఐ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది.