SEBI: కేవైసీ నిబంధనల్లో సెబీ కీలక మార్పులు.. పత్రాల సమర్పణకు చెక్
ఈ వార్తాకథనం ఏంటి
మదుపర్లకు ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు, ఒకే పత్రాలను పదేపదే సమర్పించాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థల (Market Intermediaries) మధ్య క్లయింట్ల సమాచారాన్ని పంచుకునే విధానాన్ని మెరుగుపరుస్తూ కేవైసీ (KYC) నిబంధనల్లో పలు మార్పులు ప్రకటించింది. ఈ కొత్త విధానంతో మదుపర్లకు వివిధ సంస్థల్లో ఖాతాలు తెరవడం మరింత సులభం కానుంది.
వివరాలు
పార్ట్-2లో ఈ అదనపు సమాచారాన్ని క్లయింట్లు అందించాలి
కొత్త నిబంధనల ప్రకారం.. బ్రోకరేజీ సంస్థలన్నింటికీ ఉమ్మడిగా ఉండే క్లయింట్ల అదనపు సమాచారాన్ని కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (KRA) వద్ద భద్రపరుస్తారు.
దీనివల్ల మదుపర్లు వేర్వేరు మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలను సంప్రదించినప్పుడు ఒకే వివరాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఖాతా ప్రారంభ దరఖాస్తులోని పార్ట్-2లో క్లయింట్లు ఈ అదనపు సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
స్టాక్ బ్రోకర్లు, డిపాజిటరీలు, క్లియరింగ్ కార్పొరేషన్లు తదితర సంస్థలను మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలుగా పరిగణిస్తారు.
అలాగే, సెంట్రల్ కేవైసీ ఐడెంటిఫైయర్, డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నంబర్ (PIN), అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాల గడువు తేదీ వంటి అదనపు వివరాలను కూడా సంబంధిత వ్యవస్థలో అప్‌లోడ్ చేయాలి.
వివరాలు
రెండు పనిదినాల్లోగా సంబంధిత రికార్డులను అప్‌డేట్ చేయాలి
కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ (KRA), సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCRR) నుంచి ఏవైనా వివరాల మార్పులు అందిన వెంటనే క్లయింట్ల రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
దీనివల్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సరిచేసుకోవడంతో పాటు, ఒకే వివరాలను పదేపదే మార్చాల్సిన అవసరం తగ్గుతుంది.
మ్యూచువల్ ఫండ్లను మినహాయించి మిగిలిన మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థలు క్లయింట్ల ఖాతాలను మూసివేసిన విషయాన్ని ఐదు పనిదినాల్లోగా తెలియజేయాలి.
ఈ సమాచారం అందిన రెండు పనిదినాల్లోగా సంబంధిత రికార్డులను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.
వివరాలు
మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి సెబీ ప్రత్యేక నిబంధనలు
మ్యూచువల్ ఫండ్లకు సంబంధించి కూడా సెబీ ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చింది.
ఒక క్లయింట్‌కు చెందిన ఫోలియో ఖాతాల్లో వరుసగా ఆరు నెలల పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో పాటు, ఎలాంటి పెట్టుబడులు లేకుండా బ్యాలెన్స్ సున్నాగా ఉంటే.. సంబంధిత ఫండ్ హౌస్ లేదా దాని రిజిస్ట్రార్, ట్రాన్స్‌ఫర్ ఏజెంట్ (RTA) ఐదు పనిదినాల్లోగా ఈ విషయాన్ని తెలియజేయాలి.
ఈ సమాచారం అందిన తర్వాత సంబంధిత మ్యూచువల్ ఫండ్ లేదా ఆర్‌టీఏకు క్లయింట్ వివరాల్లోని తదుపరి మార్పులను కేఆర్‌ఏ పంచుకోవడం నిలిపివేస్తుంది.
మరోవైపు, ఏదైనా మార్కెట్ మధ్యవర్తిత్వ సంస్థ నుంచి క్లయింట్ రికార్డును డౌన్‌లోడ్ చేసుకున్నప్పటికీ, 21 పనిదినాల్లోగా ఖాతాను ప్రారంభించకపోతే ఆ రికార్డును తొలగించాల్సి ఉంటుంది.
వివరాలు
ఏఐ సాయంతో దరఖాస్తుల పరిశీలన
ఇందుకు సంబంధించిన సమాచారాన్ని తదుపరి ఐదు పనిదినాల్లోగా సెబీకి తెలియజేయాలి.
ఈ మార్పుల ద్వారా కేవైసీ సమాచార నిర్వహణలో అనవసరమైన రికార్డులను తగ్గించడంతో పాటు, వివిధ సంస్థల మధ్య సమాచార మార్పిడిని క్రమబద్ధీకరించాలని సెబీ లక్ష్యంగా పెట్టుకుంది.
సెక్యూరిటీల మార్కెట్‌లో కృత్రిమ మేధ(AI)వినియోగాన్ని పెంచే దిశగా కూడా సెబీ ప్రయత్నాలు చేస్తోంది.
దరఖాస్తులను నియంత్రిత వాతావరణంలో పరిశీలించేందుకు ఏఐ శాండ్‌బాక్స్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే వెల్లడించారు.
అంతేకాకుండా,సురక్షితమైన, సరసమైన ఏఐ సాధనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్లు తెలిపారు.
సెక్యూరిటీల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దేశీయంగా నిర్వహించే ప్రత్యేక ఏఐ నమూనాను అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.