SEBI: సెబీలో కొత్త రూల్స్.. ఉద్యోగులకు వారానికి ఒక రోజు వర్క్ ఫ్రం హోమ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడంతో.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు తాత్కాలికంగా వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే అవసరం లేని ప్రయాణాలు, హోటల్ ఖర్చులు వచ్చే అంతర్గత కార్యక్రమాలను కూడా వాయిదా వేసింది. ఈ కొత్త మార్గదర్శకాలు మే 25, 2026 నుంచి ఎనిమిది వారాల పాటు అమల్లో ఉండనున్నట్లు సమాచారం. సెబీ మానవ వనరుల విభాగం గురువారం జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం.. గ్రేడ్ 'A' నుంచి 'C' వరకు ఉన్న అధికారులు వారానికి ఒక రోజు రోటేషన్ పద్ధతిలో ఇంటి నుంచే పని చేయవచ్చు.
వివరాలు
Group D పై స్థాయి అధికారులు తప్పనిసరిగా కార్యాలయానికి హాజరుకావాలి
ఇందులో అసిస్టెంట్ మేనేజర్,మేనేజర్,అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయి అధికారులు ఉంటారు. అయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ (Group D),అంతకంటే పై స్థాయి అధికారులు మాత్రం తప్పనిసరిగా కార్యాలయానికి హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే ఛైర్మన్ కార్యాలయం,హోల్ టైమ్ మెంబర్స్ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది,సీనియర్ అధికారుల సెక్రటరీలు,అకౌంట్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు కూడా రెగ్యులర్‌గా ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు చీఫ్ జనరల్ మేనేజర్లు, రీజినల్ డైరెక్టర్లు, విభాగాధిపతులు గ్రేడ్ A నుంచి C అధికారులకు రోస్టర్ సిద్ధం చేసి.. కనీసం 50 శాతం మంది ఉద్యోగులు కార్యాలయంలో భౌతికంగా ఉండేలా చూడాలని ఆదేశించింది.
వివరాలు
కొత్త కార్యక్రమాలను షెడ్యూల్ చేయద్దు
ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులు డేటా భద్రత, గోప్యత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని.. అవసరమైతే వెంటనే కార్యాలయానికి రావడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా సంస్థలో నిర్వహించే "బ్రెయిన్‌స్టార్మింగ్ ప్రోగ్రామ్స్, కామ్రాడరీ, కాన్‌క్లేవ్స్" వంటి అంతర్గత కార్యక్రమాలను కూడా ఎనిమిది వారాల పాటు నిలిపివేయాలని సెబీ ఆదేశించింది. ఈ కాలంలో కొత్త కార్యక్రమాలను షెడ్యూల్ చేయవద్దని తెలిపింది. ఇంధన వినియోగాన్ని తగ్గించే దిశగా ఉద్యోగులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, కార్‌పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, సబ్సిడీ బస్సు సేవలను ఎక్కువగా వినియోగించాలని సూచించింది. అలాగే అవసరం లేని ప్రయాణాలను తగ్గించేందుకు వర్చువల్ మీటింగ్స్ నిర్వహించాలని.. బయటి స్టేక్‌హోల్డర్లతో సమావేశాలు కూడా సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని అడ్వైజరీలో పేర్కొంది.
వివరాలు
కరోనా కాలంలో కూడా వర్క్ ఫ్రం హోమ్
ఈ మార్గదర్శకాలు సెబీ ప్రధాన కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాలు, స్థానిక కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి వర్తిస్తాయని సమాచారం. ఎనిమిది వారాల తర్వాత పరిస్థితులను సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా కరోనా కాలంలో కూడా సెబీ ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే.