SEBI: ఫిన్‌ఫ్లూయెన్సర్లకు సెబీ షాక్.. 1.20 లక్షల పోస్టులు డిలీట్
ఈ వార్తాకథనం ఏంటి
రిజిస్ట్రేషన్ లేకుండా సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్న ఫిన్‌ఫ్లూయెన్సర్లపై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. దాదాపు 1,20,000కి పైగా తప్పుదారి పట్టించే పోస్టులను తొలగించినట్లు సెబీ వెల్లడించింది. ఇందుకోసం 'సుదర్శన్' అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ఉపయోగించినట్లు సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో జరుగుతున్న నిబంధనల ఉల్లంఘనలను ఈ టూల్ గుర్తిస్తుందని చెప్పారు. పెట్టుబడి సలహాలు ఇవ్వాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఉండాలని, అదే సమయంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేశారు. అయితే ఆ స్వేచ్ఛ పేరుతో తప్పుదారి పట్టించే సమాచారం ఇస్తే సెబీ జోక్యం చేసుకుంటుందని హెచ్చరించారు.
వివరాలు
రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరగడంలో సోషల్ మీడియా కథనాల ప్రభావం
సోషల్ మీడియా ద్వారా ఆడియో, వీడియో సహా పలు భాషల్లో వచ్చే కంటెంట్‌ను 'సుదర్శన్' ట్రాక్ చేస్తోందని,ఈ విషయంలో సోషల్ మీడియా సంస్థలు కూడా సహకరిస్తున్నాయని తెలిపారు. కోవిడ్ తర్వాత డెరివేటివ్స్ మార్కెట్‌లో రిటైల్ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరగడంలో సోషల్ మీడియా కథనాలు ప్రభావం చూపాయని ఆయన అన్నారు. ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా ఈజీ మనీ వస్తుందనే ప్రచారంతో చాలా మంది ప్రభావితమయ్యారని పేర్కొన్నారు.
వివరాలు
సెబీ డేటా ఆధారంగా చర్యలు
దీంతో సెబీ డేటా ఆధారంగా చర్యలు తీసుకుని, నష్టాలపై ఇన్వెస్టర్లకు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. మార్కెట్ నియంత్రణ అంటే కఠిన చర్యలు తీసుకోవడం కాదని, అవసరమైనంత మేరకు మాత్రమే నియంత్రణ ఉండాలనే దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పారు. మార్కెట్ రిస్క్‌ల నుంచి కాపాడుకోవాలంటే వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం అని, టెక్నాలజీ సహాయంతో చెడు చర్యలను అరికట్టడమే లక్ష్యమని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.