భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోజంతా నష్టాల బాట పట్టిన షేర్ మార్కెట్, ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్- సెన్సెక్స్ సూచీ 149 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ - నిఫ్టీ 62 పాయింట్లు చొప్పున లాభాల బాట పట్టింది. ఉదయం (మార్నింగ్ సెషన్) ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి మళ్లీ వేగంగా పుంజుకున్నాయి. ఈ మేరకు ఎట్టకేలకు లాభాలతో ముగియడం విశేషం. మరోవైపు ఆర్బీఐ(RBI) మానిటరీ పాలసీ సందర్భంగా మదుపర్లు అప్రమత్తతో మెలిగారు. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 149 పాయింట్లు లాభంతో 65,996కి ఎగబాకింది.
లాభాల బాట పట్టిన స్టీల్, మోటర్ కంపెనీలు
మరో సూచీ నిఫ్టీ 62 పాయింట్ల మేర పుంజుకుని 19,633 వద్ద బలపడింది. లాభాల షేర్లు : జేఎస్ డబ్ల్యూస్టీల్ (JSW STEEL) (2.68%), టాటా మోటార్స్ (TATA MOTORS) (2.57%), మహీంద్రా అండ్ మహీంద్రా (2.35%), టాటా స్టీల్ (TATA STEELS) (1.74%), ఐటీసీ(ITC) (1.36%) తదితర కంపెనీలు లాభాలను ఆర్జించిన జాబితాలో ఉన్నాయి. నష్టాల షేర్లు : బజాజ్ ఫైనాన్స్ (BAJAJ FINANCE) (-0.87%), మారుతి (MARUTHI) (-0.87%), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI BANK) (-0.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.52%), ఏసియన్ పెయింట్స్ (-0.47%) తదితర సంస్థలు నష్టాలను ముటగట్టుకున్నాయి.