Stock Market: సెన్సెక్స్‌కు భారీ షాక్.. 1,000 పాయింట్లు కుప్పకూలిన మార్కెట్.. కారణాలివే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనాన్ని చవిచూశాయి. గ్లోబల్ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, అంతర్జాతీయంగా బాండ్ యీల్డ్స్ పెరగడం, ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకడం, రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్టానికి పడిపోవడం వంటి అంశాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. దీంతో ఉదయం నుంచే అమ్మకాల ఒత్తిడి పెరిగి మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ దాదాపు 988 పాయింట్లు పడిపోయి 74,249 స్థాయికి చేరుకోగా.. నిఫ్టీ 300 పాయింట్లకుపైగా నష్టపోయి 23,339 వద్ద ట్రేడ్ అయింది. ఈ భారీ పతనంతో బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువలో సుమారు రూ.5లక్షల కోట్ల మేర ఆవిరైంది. ప్రస్తుతం మొత్తం మార్కెట్ క్యాప్ రూ.456 లక్షల కోట్లకు తగ్గింది.
వివరాలు
మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా భారీ అమ్మకాలు
మార్కెట్‌లో భయాందోళనలు పెరిగినట్టు సూచించే ఇండియా VIX సూచీ 5 శాతం పైగా ఎగిసి 19.78 వద్దకు చేరింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కూడా భారీ అమ్మకాలు కనిపించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. ఐటీ రంగం మినహా అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 2 శాతం కంటే ఎక్కువగా క్షీణించింది. ఎన్‌ఎస్‌ఈలో మొత్తం షేర్లలో 2,152 స్టాక్స్ నష్టాల్లో ముగియగా.. కేవలం 488 మాత్రమే లాభాల్లో నిలిచాయి. మరో 110 షేర్లు మార్పులేకుండా ట్రేడ్ అయ్యాయి.
వివరాలు
రూపాయి మరింత బలహీనపడే అవకాశం
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ముందుగానే మార్కెట్ బలహీనంగా ప్రారంభమయ్యే అవకాశముందని హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం వల్ల దేశంలో ఇంధన ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, దాంతో ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. అమెరికా 10 ఏళ్ల బాండ్ యీల్డ్ 4.62 శాతానికి చేరడం కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లకు ప్రతికూల సంకేతమని పేర్కొన్నారు. రూపాయి మరింత బలహీనపడే అవకాశం ఉందని, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మరింత పెరగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు ఇవే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు నిలిచిపోయాయని, పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని హెచ్చరించడం. వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా బాండ్ యీల్డ్స్ రికార్డు స్థాయికి చేరడం. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే కొత్త కనిష్టానికి పడిపోవడం. సోమవారం ఒక డాలర్ విలువ రూ.96.18కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు మళ్లీ బ్యారెల్‌కు 112 డాలర్లకు పైగా ఎగబాకడం.