Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 961.42 పాయింట్లు పతనం
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు గణనీయమైన నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఎఫ్‌ఎంసీజీ, ఆటో, రియల్ ఎస్టేట్, ఫార్మా రంగాల షేర్లపై భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఒక దశలో సెన్సెక్స్ వెయ్యికి పైగా పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 25,200 స్థాయికి దిగువకు జారిపోయింది. మదుపర్ల సంపదకు సూచికగా భావించే బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.5 లక్షల కోట్ల మేర తగ్గి రూ.463 లక్షల కోట్లకు పరిమితమైంది. సెన్సెక్స్ ఉదయం 82,220.48 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. గత ముగింపు 82,248.61 పాయింట్లతో పోలిస్తే ఇది తక్కువ స్థాయే.
వివరాలు
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 91.02గా నమోదు
రోజంతా పరిమిత శ్రేణిలో ఊగిసలాడిన సూచీ, చివర్లో మరింత ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో సుమారు వెయ్యి పాయింట్లకు పైగా పతనమై 81,159.15 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 961.42 పాయింట్ల నష్టంతో 81,287.19 పాయింట్ల వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 11 పైసలు పడిపోయి 91.02 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో ట్రెంట్,హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగిలిన అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారతీ ఎయిర్‌టెల్,బజాజ్ ఫిన్‌సర్వ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, మారుతీ సుజుకీ షేర్లు ఎక్కువగా క్షీణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా,బంగారం ఔన్సు ధర 5169 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
వివరాలు
పతనానికి కారణాలు
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) తమ అమ్మకాల ధోరణిని కొనసాగించడం ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం ఒక్క రోజే రూ.3,465.99 కోట్ల విలువైన షేర్లను వారు విక్రయించడం మార్కెట్ భావోద్వేగాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఎన్విడియా వంటి ప్రముఖ కంపెనీలు మెరుగైన త్రైమాసిక ఫలితాలు వెల్లడించినప్పటికీ, అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. దీని ప్రభావం ఆసియా మార్కెట్లతో పాటు భారత మార్కెట్లపైనా పడింది.
వివరాలు
పతనానికి కారణాలు
అదనంగా, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడం, వాషింగ్టన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఏడు నెలల గరిష్ఠానికి చేరుకోవడం కూడా ఒత్తిడిని పెంచింది. దీనికి తోడు రూపాయి విలువ మళ్లీ 91 స్థాయికి చేరుకోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.