Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 372 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో మరోసారి నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించి అమ్మకాలకే ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో ఆటో, ఐటీ, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో విక్రయాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు భారీగా పడిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 372.10 పాయింట్లు కోల్పోయి 76,728.37 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 109.75 పాయింట్లు తగ్గి 23,946.25 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పరిస్థితులపై కొనసాగుతున్న అనిశ్చితి కారణంగా ట్రేడర్లు రిస్క్ తీసుకోవడానికి వెనుకంజ వేశారు. ఫలితంగా దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ముఖ్యంగా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు అత్యధిక నష్టాలను నమోదు చేశాయి.
వివరాలు
నిఫ్టీకి 23,900 వద్ద మద్దతు, 24,000 వద్ద నిరోధం ఉందని నిపుణుల విశ్లేషణ
సాంకేతిక విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం నిఫ్టీకి 24,000 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఈ స్థాయిని అధిగమించినా 24,100 నుంచి 24,200 మధ్య మరోసారి అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. మరోవైపు దిగువ స్థాయిలో 23,900తక్షణ మద్దతుగా, 23,800బలమైన మద్దతు స్థాయిగా నిలవొచ్చని విశ్లేషించారు. రంగాల వారీగా చూస్తే ఫార్మా,మెటల్,హెల్త్‌కేర్ సూచీలు లాభాల్లో నిలిచాయి.అయితే ఆటో,కెమికల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు అత్యధిక నష్టాలను చవిచూశాయి. బ్రాడర్ మార్కెట్లలో కూడా బలహీనత కనిపించింది.మిడ్‌క్యాప్ సూచీ 0.37 శాతం,స్మాల్‌క్యాప్ సూచీ 0.62 శాతం మేర క్షీణించాయి. రాబోయే రోజుల్లో పశ్చిమాసియా పరిణామాలు,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చే సంకేతాలే దేశీయ మార్కెట్ దిశను ప్రభావితం చేసే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.