Stock Market: సెన్సెక్స్ 650 పాయింట్లకు పైగా జంప్.. మార్కెట్ ర్యాలీకి అసలు కారణాలివే..
ఈ వార్తాకథనం ఏంటి
వరుస నష్టాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పుంజుకుంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు గణనీయమైన లాభాలతో దూసుకెళ్లాయి. నిఫ్టీ వరుసగా ఏడు సెషన్లుగా ఎదుర్కొంటున్న నష్టాలకు బ్రేక్ పడగా.. సెన్సెక్స్ నాలుగు సెషన్ల నష్టాల పరంపరను ముగించింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, షార్ట్ కవరింగ్, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు దేశీయ మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ఇన్ఫోసిస్,టీసీఎస్ వంటి భారీ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు కూడా మార్కెట్‌కు ఊతమిచ్చాయి. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 656 పాయింట్లు ఎగబాకి 77,566 వద్దకు చేరింది. నిఫ్టీ 50 సూచీ 160 పాయింట్లకు పైగా లాభపడి 24,239 స్థాయికి చేరుకుంది.
వివరాలు
అమెరికా ట్రెజరీ నిర్ణయంతో మార్కెట్లకు మరింత ఊతం
విస్తృత మార్కెట్లలోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100,నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 సూచీలు దాదాపు ఒక్క శాతం చొప్పున లాభపడ్డాయి.
సెన్సెక్స్‌లో ఇన్ఫోసిస్,ఇండిగో,టీసీఎస్,బజాజ్ ఫైనాన్స్,టెక్ మహీంద్రా షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఈ కంపెనీల షేర్లు దాదాపు 2శాతం వరకు పెరిగాయి. దీంతో మార్కెట్‌లో కొనుగోళ్లకు మరింత ఊపొచ్చింది.
అమెరికా ట్రెజరీ తీసుకున్న కీలక నిర్ణయం కూడా భారత మార్కెట్లకు సానుకూలంగా మారింది.
దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్ పరిమాణాన్ని రెట్టింపు చేయనున్నట్లు అమెరికా ట్రెజరీ ప్రకటించింది.
పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్‌ను నియంత్రించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
వివరాలు
అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడంతో రూపాయికి బలం.. విదేశీ పెట్టుబడుల జోరు
దీంతో అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గాయి. 10 ఏళ్ల అమెరికా బాండ్ ఈల్డ్ 4.637 శాతానికి, 30 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5.181 శాతానికి దిగివచ్చింది.
అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం వల్ల రూపాయికి కూడా కొంత మద్దతు లభించింది.
ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 17 పైసలు బలపడి 95.56 వద్దకు చేరింది.
భారత మార్కెట్‌లో విదేశీ పెట్టుబడిదారులు కూడా కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు.
బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు దలాల్ స్ట్రీట్‌లో రూ.408 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.
అంతకుముందు సెషన్‌లో కూడా మార్కెట్లు పెద్దగా కదలకపోయినప్పటికీ విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,573 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.
వివరాలు
ఏడు రోజుల నష్టాలకు బ్రేక్.. గ్లోబల్ మార్కెట్ల జోరుతో పుంజుకున్న నిఫ్టీ
ఇటీవల నిఫ్టీ వరుసగా ఏడు సెషన్లలో 2 శాతానికి పైగా నష్టపోయింది. 11 నెలల తర్వాత ఇంత సుదీర్ఘంగా నష్టపోవడం ఇదే తొలిసారి.
ఈ నేపథ్యంలో గురువారం వచ్చిన భారీ కొనుగోళ్లు మార్కెట్‌కు ఊరటనిచ్చాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు కూడా భారత సూచీలకు కలిసొచ్చాయి.
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి సూచీ 6 శాతానికి పైగా పెరిగింది.
జపాన్ నిక్కీ, హాంకాంగ్ హ్యాంగ్‌సెంగ్ సూచీలు ఒక్కోటి 1 శాతానికి పైగా లాభపడ్డాయి. దీంతో దేశీయ మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లలో సానుకూల సెంటిమెంట్ పెరిగింది.
వివరాలు
మార్కెట్‌లో కొనుగోళ్ల జోరు.. ర్యాలీకి ఇవే ప్రధాన కారణాలు
మార్కెట్‌లో మొత్తం బ్రెడ్‌త్ కూడా బలంగా పాజిటివ్‌గా మారింది.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో 1,965 షేర్లు లాభాల్లో ట్రేడవగా.. 518 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మరో 110 షేర్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
మొత్తంగా చూస్తే అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గడం, విదేశీ పెట్టుబడులు, షార్ట్ కవరింగ్, గ్లోబల్ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్‌లో గురువారం ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.