Loading...
Stock Market: దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. 628 పాయింట్ల లాభం, 24,200 దాటిన నిఫ్టీ
దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. 628 పాయింట్ల లాభం, 24,200 దాటిన నిఫ్టీ

Stock Market: దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. 628 పాయింట్ల లాభం, 24,200 దాటిన నిఫ్టీ

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 20, 2026
04:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం దూసుకెళ్లాయి. దీంతో వరుసగా ఏడు సెషన్లుగా కొనసాగిన నష్టాలకు తెరపడింది. అమెరికా బాండ్ల రాబడులు తగ్గడం మార్కెట్‌ సెంటిమెంట్‌కు మద్దతుగా నిలిచింది. దీనికి తోడు విదేశీ మదుపర్ల పెట్టుబడులు,వివిధ రంగాల షేర్లలో కొనుగోళ్లు సూచీలను లాభాల బాట పట్టించాయి. ముఖ్యంగా రియాల్టీ, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌, ఐటీ రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు మరింత బలాన్నిచ్చాయి. సెన్సెక్స్‌ గురువారం ఉదయం 77,468.45 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. బుధవారం ఇది 76,909.68 వద్ద ముగిసింది. ప్రారంభం నుంచే లాభాల్లో కొనసాగిన సూచీ.. ఇంట్రాడేలో 77,611.11 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది.

వివరాలు 

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా నమోదు 

చివరకు 628.04 పాయింట్లు ఎగబాకి 77,537.72 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 153.55 పాయింట్లు లాభపడి 24,231.85 వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ 30లో టైటాన్‌, హెచ్‌సీఎల్‌, ఇండిగో, టాటా స్టీల్‌ షేర్లు మాత్రమే నష్టాల్లో ముగిశాయి. మిగిలిన కంపెనీల షేర్లన్నీ లాభాలను నమోదు చేశాయి.

విస్తృత స్థాయిలో కొనుగోళ్లు జరగడం కూడా మార్కెట్‌ ర్యాలీకి దోహదపడింది.

కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.71గా నమోదైంది.

వివరాలు 

లాభాల్లో ట్రేడ్ అయిన దక్షిణ కొరియా, జపాన్‌, షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్లు 

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 93.94 డాలర్ల వద్ద కొనసాగింది.

మరోవైపు బంగారం ఔన్స్‌ ధర 4,490.60 డాలర్ల వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపించింది.

దక్షిణ కొరియా, జపాన్‌, షాంఘై, హాంకాంగ్‌ మార్కెట్ల సూచీలు లాభాల్లోనే ట్రేడయ్యాయి.

అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన పరిస్థితులు, అమెరికా బాండ్‌ రాబడుల తగ్గుదల, దేశీయంగా వివిధ రంగాల్లో కొనుగోళ్లు కలిసి భారత సూచీలకు ఊతమిచ్చాయి.

ADVERTISEMENT