LOADING...
Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి
దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ ర్యాలీ.. మదుపర్ల సంపద ₹12 లక్షల కోట్లు పైకి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. దాంతో దలాల్‌ స్ట్రీట్‌లో బుల్స్‌ హవా కొనసాగింది. ఉదయం మార్కెట్‌ ప్రారంభమైన వెంటనే మొదలైన ర్యాలీ ముగింపు వరకు వేగం తగ్గకుండా కొనసాగింది. ఈ ప్రభావంతో సెన్సెక్స్‌ 2 వేల పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 25,700 మార్క్‌ను దాటింది. అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాల బాట పట్టాయి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.12 లక్షల కోట్ల మేర పెరిగి రూ.467.35 లక్షల కోట్లకు చేరింది.

వివరాలు 

50 శాతం సుంకాలు 18 శాతానికి

భారత్‌తో ట్రేడ్‌ డీల్‌కు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం రాత్రి ప్రకటించారు. అలాగే ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. అమెరికా దిగుమతులపై విధిస్తున్న సుంకాలను సున్నా స్థాయికి తీసుకెళ్లేందుకు, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయేందుకు భారత్‌ అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు భారత్‌ ఉత్పత్తులపై అమలులో ఉన్న 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గనున్నాయి. ట్రంప్‌ ప్రకటన మార్కెట్‌కు బలమైన పాజిటివ్‌ సంకేతాలు ఇచ్చింది.

వివరాలు 

భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్

బుల్‌ ర్యాలీ ఇలా సాగింది. ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో సెన్సెక్స్‌ భారీ లాభాలతో ప్రారంభమైంది. క్రితం ముగింపు 81,666.46తో పోలిస్తే దాదాపు 3,600 పాయింట్లు పెరిగి 85,323.20 వద్ద ఓపెన్‌ అయింది. ఇంట్రాడేలో ఒక దశలో 4 వేల పాయింట్లకుపైగా ఎగబాకి 85,871.73 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 2,072.67 పాయింట్ల లాభంతో 83,739.13 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్‌ సమయంలో 26,341.20 స్థాయిని చేరింది. ముగింపు సమయానికి 639.15 పాయింట్లు లాభపడి 25,727.55 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ కూడా బలపడింది.డాలర్‌తో పోలిస్తే సోమవారం రూపాయి మారకం విలువ 91.51గా ఉండగా,ట్రేడ్‌ డీల్‌ ప్రభావంతో ఒక్క రోజులోనే 1.36 శాతం మెరుగై 90.26కి చేరింది.

Advertisement

వివరాలు 

ఈ స్థాయిలో రూపాయి బలపడటం ఇదే తొలిసారి

ఈ స్థాయిలో రూపాయి బలపడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సెన్సెక్స్‌ 30 షేర్లలో టెక్‌ మహీంద్రా, బీఈఎల్‌ మినహా మిగతా అన్ని షేర్లు లాభాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్‌ 9.12 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 6.68 శాతం, ఇండిగో 5.51 శాతం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ 2.83 శాతం, సన్‌ ఫార్మా 4.54 శాతం చొప్పున పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 66 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 4,921 డాలర్ల స్థాయిలో కొనసాగుతోంది.

Advertisement