Page Loader
Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 199, నిఫ్టీ 102 పాయింట్లు 
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..

Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 199, నిఫ్టీ 102 పాయింట్లు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 14, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి నష్టాలలో ముగిశాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లను విధిస్తానని ట్రంప్‌ ప్రకటించడంతో మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నిర్ణయంతో వాణిజ్య యుద్ధ భయాలు పెరిగి, సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 700 పాయింట్లు కోల్పోయింది, నిఫ్టీ 22,774.85 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. చివరికి రెండు ప్రధాన సూచీలు కొంతవరకు కోలుకున్నప్పటికీ, మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది.

వివరాలు 

మార్కెట్‌ సూచీల స్థితిగతులు 

సెన్సెక్స్‌ ఉదయం 76,388.99 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు 76,138.97) లాభాలతో ప్రారంభమైంది. కానీ కొద్ది సేపటికే నష్టాల్లోకి మళ్లింది. రోజంతా మార్పులు కొనసాగినప్పటికీ, ఇంట్రాడే కనిష్ఠం 75,439.64 పాయింట్లను తాకింది. చివరికి 199 పాయింట్ల నష్టంతో 75,939.21 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 102.15 పాయింట్ల నష్టంతో 22,929.25 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడి 86.84 వద్ద ముగిసింది.

వివరాలు 

లాభపడినవి - నష్టపోయినవి 

సెన్సెక్స్‌ 30 సూచీలో అదానీ పోర్ట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు లాభాలను అందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ 75.44 డాలర్ల వద్ద కొనసాగగా, బంగారం ధర ఔన్సుకు 2960 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరి, 3000 డాలర్ల మార్కుకు దగ్గరగా ఉంది.

వివరాలు 

మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణాలు 

1. అమెరికా-భారత్ వాణిజ్య విధానాలు: భారత్‌ మిత్రదేశమైనప్పటికీ, పరస్పర పన్నుల విషయంలో వెనక్కి తగ్గబోమని ట్రంప్‌ స్పష్టంగా తెలిపారు. భారత్‌తో పాటు ఇతర దేశాలపై రెసీప్రోకల్‌ టారిఫ్‌లు విధించనున్నట్లు ఆయన ప్రకటించడంతో, మార్కెట్లు ప్రతికూలంగా స్పందించాయి. 2. విదేశీ మదుపర్ల విక్రయాలు: విదేశీ సంస్థాగత మదుపర్లు భారీగా షేర్ల విక్రయాలు జరుపుతున్నందున మార్కెట్‌ పడిపోయింది. డాలర్‌ విలువ తగ్గినప్పుడు లేదా అమెరికా బాండ్‌ రాబడులు తగ్గినప్పుడే ఈ ట్రెండ్‌ మారొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 3. కంపెనీల ఆర్థిక ఫలితాలు: ప్రధాన కంపెనీలు మూడో త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో లాభాలను ప్రకటించలేకపోవడం కూడా మార్కెట్ల పతనానికి కారణమైంది.