LOADING...
Sensex: కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!
కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!

Sensex: కుదేలైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,200 పాయింట్లు పతనం.. రూ.9 లక్షల కోట్ల నష్టం!

వ్రాసిన వారు Moogati Shabari
Apr 30, 2026
03:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

నేడు ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ భారీ షాక్‌కు గురైంది. అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి. 30 షేర్ల సెన్సెక్స్ సూచీ ఒక దశలో 1,200 పాయింట్లకు పైగా క్షీణించి 76,259 స్థాయికి చేరింది. అదే సమయంలో నిఫ్టీ 50 కూడా 350 పాయింట్లకు పైగా పడిపోయి 23,797 వద్ద నిలిచింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్ల పరిస్థితి కూడా దారుణంగా మారింది. BSE 150 మిడ్‌క్యాప్, BSE 250 స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం కంటే ఎక్కువగా పడిపోయాయి.

వివరాలు

స్టాక్ మార్కెట్ పడిపోవడానికి కారణాలివే..

ఈ భారీ పతనంతో పెట్టుబడిదారులు సుమారు రూ.9 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. BSEలో లిస్ట్ అయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.460 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతున్నట్లు సమాచారం. అమెరికా, ఇరాన్‌పై ఒత్తిడి పెంచుతుండగా, ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా ట్రెజరీ విభాగం ఇరాన్‌కు సంబంధించిన $344 మిలియన్ క్రిప్టో ఆస్తులను ఫ్రీజ్ చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా హెచ్చరికలు జారీ చేశారు.

వివరాలు

క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్..

మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగడం కూడా మార్కెట్‌పై ప్రభావం చూపింది. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు $120 దాటాయి. 2022 తర్వాత ఇదే అత్యధిక స్థాయి. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. ముఖ్యంగా చమురు దిగుమతులపై ఆధారపడే భారత్‌కు ఇది మరింత ఆందోళనకర పరిస్థితి. రూపాయి కూడా బలహీనపడుతోంది. గురువారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి డాలర్‌తో పోలిస్తే 32 పైసలు పడిపోయి 95.20 అనే చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. క్రూడ్ ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నెలలో వచ్చిన లాభాలను దాదాపుగా కోల్పోయిన రూపాయి వరుసగా మూడో వారానికి నష్టాల దిశగా సాగుతోంది.

Advertisement

వివరాలు

మార్కెట్ ‌పై అదనపు భారం..

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వైఖరి కూడా మార్కెట్‌ను కలవరపెడుతోంది. ఏప్రిల్ 29న ఫెడ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినా, చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు మార్కెట్‌ను ఆందోళనకు గురి చేశాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఇంకా కొనసాగుతున్నాయని, ఇంధన ధరల ప్రభావాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని ఆయన అన్నారు. దీంతో వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ట్రేడర్లు భావిస్తున్నారు. ఇక విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) నిరంతరం అమ్మకాలు కొనసాగించడం కూడా మార్కెట్‌పై భారంగా మారింది. ఈ నెల మధ్యలో కొద్ది రోజుల పాటు కొనుగోళ్లు చేసినప్పటికీ, మళ్లీ అమ్మకాల దిశగా మళ్లారు.

Advertisement

వివరాలు

రూ.62 వేల కోట్ల షేర్స్ అమ్మకం..

వరుసగా ఎనిమిది ట్రేడింగ్ సెషన్లుగా భారత షేర్లను విక్రయిస్తున్నారు. గత ఏడాది జూలై నుంచి చూస్తే, ప్రతి నెలా వారు క్యాష్ సెగ్మెంట్‌లో అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే రూ.62,000 కోట్లకు పైగా షేర్లను విక్రయించారు. మొత్తంగా చూస్తే, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న చమురు ధరలు, రూపాయి బలహీనత, అమెరికా ఫెడ్ వైఖరి, FIIs అమ్మకాలు..ఈ ఐదు ప్రధాన కారణాల వల్లే ఈరోజు భారత స్టాక్ మార్కెట్ తీవ్ర పతనాన్ని చూసింది.

Advertisement