LOADING...
Stock Market: వరుసగా రెండో రోజు జోష్‌లో మార్కెట్లు.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్
వరుసగా రెండో రోజు జోష్‌లో మార్కెట్లు.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్

Stock Market: వరుసగా రెండో రోజు జోష్‌లో మార్కెట్లు.. 500 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య దోహాలో కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలపై మార్కెట్లో ఆశావహ వాతావరణం నెలకొనడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు సుమారు ఒక శాతం తగ్గి 70.80 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ షేర్లలో మళ్లీ కొనుగోళ్లు పెరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 84.96 వద్ద బలపడటం కూడా మార్కెట్లకు ఊతమిచ్చింది. ఈ సానుకూల పరిణామాల ప్రభావంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి.

వివరాలు 

నిఫ్టీ @24,149

గత ట్రేడింగ్ సెషన్‌లో 76,922 పాయింట్ల వద్ద ముగిసిన సెన్సెక్స్ గురువారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై,అనంతరం కొనుగోళ్ల ఊపుతో మరింత ఎగబాకింది. ఉదయం 9:40 గంటల సమయానికి సెన్సెక్స్ 492 పాయింట్లు పెరిగి 77,415 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే ధోరణిని కొనసాగిస్తూ 143 పాయింట్ల లాభంతో 24,149 వద్ద కదలాడుతోంది. సెన్సెక్స్,నిఫ్టీ సూచీల్లో కోఫోర్జ్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఇన్ఫో ఎడ్జ్,ఎంఫసిస్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు వెర్నోవా టీడీ, అవెన్యూ సూపర్‌మార్ట్స్, హిటాచీ ఎనర్జీ, భెల్, సీజీ పవర్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 322 పాయింట్ల లాభంతో ఉండగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 169 పాయింట్లు పెరిగి సానుకూల ధోరణిని ప్రదర్శిస్తోంది.

Advertisement