Stock Market: భారత్-ఈయూ ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. సెన్సెక్స్,నిఫ్టీ గ్రీన్‌లో క్లోజ్
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. రోజంతా జరిగిన లావాదేవీల్లో సెన్సెక్స్ 319 పాయింట్లు పెరిగి 81,857 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 126 పాయింట్లు లాభపడి 25,175 స్థాయికి చేరుకుంది.డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 91.73 వద్ద కొనసాగింది. అయితే ఉదయం సెషన్‌లో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 449 పాయింట్లు పడిపోగా,నిఫ్టీ 116పాయింట్లు క్షీణించింది. తర్వాత భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ట్రేడ్ డీల్‌పై ఉన్న సానుకూల అంచనాలు మార్కెట్‌కు మద్దతుగా నిలిచాయి. అదే సమయంలో ఆసియా మార్కెట్లు లాభాల బాట పట్టాయి.రూపాయి బలపడటం, ముడి చమురు ధరలు తగ్గడం కూడా దేశీయ మార్కెట్లకు కలిసి వచ్చింది.
వివరాలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్ ధర 65.12 డాలర్లు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు బ్యారెల్ ధర 65.12 డాలర్లకు చేరింది. అలాగే అమెరికా టారిఫ్‌లను తగ్గించే అవకాశాలపై ఉన్న అంచనాలు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచాయి. ఈ పరిణామాలన్నీ కలిసి సూచీలను లాభాల దిశగా నడిపించాయి. సెన్సెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. మరోవైపు ఎంఅండ్‌ఎం, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలను చవిచూశాయి.