Stock Market: లాభాల స్వీకరణతో వెనక్కి తగ్గిన మార్కెట్లు.. గరిష్ఠాల నుంచి 700 పాయింట్లు జారిన సెన్సెక్స్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం నుంచి బలమైన కొనుగోళ్లతో దూసుకెళ్లిన సూచీలు.. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో అధిక భాగం లాభాలను కోల్పోయాయి. దీంతో ఇంట్రాడే గరిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు వెనక్కి తగ్గినా.. చివరికి స్వల్ప లాభాలతో ముగిసింది. నిఫ్టీ మాత్రం 24 వేల మార్క్‌కు ఎగువనే నిలిచింది. సెన్సెక్స్ 76,991.22 పాయింట్ల గత ముగింపుతో పోలిస్తే 77,391.07 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో 77,803.18 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం తర్వాత లాభాల స్వీకరణ పెరగడంతో సూచీ క్రమంగా దిగజారి చివరకు 109.25 పాయింట్లు పెరిగి 77,100.47 వద్ద ముగిసింది.
వివరాలు
బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 72 డాలర్లు
నిఫ్టీ 34.35 పాయింట్లు లాభపడి 24,056 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.94.40గా నమోదైంది. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఇండిగో, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలు నమోదు చేశాయి. మరోవైపు పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బీఈఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 72 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 3,984 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.