IPO: ఐపీఓ బాటలో షిప్‌రాకెట్.. రూ.2,342 కోట్ల సమీకరణ ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
టెమాసెక్ పెట్టుబడులు ఉన్న ఇ-కామర్స్ లాజిస్టిక్స్ ప్లాట్‌ఫామ్ షిప్‌రాకెట్ ఐపీఓ ద్వారా మొత్తం రూ.2,342 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్ధమైంది. ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ వద్ద కంపెనీ దాఖలు చేసింది. ఈ ఐపీఓలో భాగంగా తాజా ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ.1,100 కోట్లు సమీకరించనున్నారు. అదే సమయంలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో వాటాదారులు రూ.1,242.3 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో లైట్‌రాక్, ట్రైబ్ క్యాపిటల్, బెర్టెల్స్‌మాన్, అరవింద్ లిమిటెడ్, గౌతమ్ కపూర్, సాహిల్ గోయల్, విశేష్ ఖురానా తదితరులు తమ వాటాల్లో కొంత భాగాన్ని తగ్గించుకోనున్నారు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధులను మార్కెటింగ్ కార్యకలాపాలు, టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బలోపేతానికి వినియోగించనున్నట్టు షిప్‌రాకెట్ వెల్లడించింది.
Details
నిధుల సమీకరణకు ముందుకొచ్చిన శివగంగా
రుణాలు, వాటిపై వడ్డీని ముందస్తుగా చెల్లించేందుకు కూడా కొంత మొత్తాన్ని ఉపయోగించనున్నట్టు తెలిపింది. ప్రీ-ఐపీఓ కేటాయింపు ద్వారా రూ.220కోట్ల వరకు నిధులు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఒకవేళ ఈ నిధులు సమకూరితే, తాజా షేర్ల జారీ పరిమాణాన్ని తగిన విధంగా సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. శివగంగా డ్రిల్లర్స్ కూడా నిధుల సమీకరణకు ముందుకు వచ్చింది. కంపెనీ రూ.400కోట్ల ఐపీఓ కోసం సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఈ ఇష్యూ పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారానే ఉండనుంది. ఐపీఓ ద్వారా వచ్చే నిధులను కొత్త ప్లాంట్ ఏర్పాటు, మెషినరీ కొనుగోలు, రుణాల చెల్లింపు, అలాగే సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని శివగంగా డ్రిల్లర్స్ స్పష్టం చేసింది.