Shiprocket: షిప్‌రాకెట్ షేరు దుమ్మురేపింది.. 35 శాతం ప్రీమియంతో గ్రాండ్ లిస్టింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్‌ఎస్‌ఈలో షిప్‌రాకెట్ షేరు ఐపీఓలో నిర్ణయించిన రూ.97 ధర కంటే 35 శాతం అధికంగా రూ.131 వద్ద లిస్టింగ్ అయింది. బీఎస్‌ఈలో 33.51 శాతం ప్రీమియంతో రూ.129.50 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. మార్కెట్ వర్గాలు ముందుగా అంచనా వేసిన స్థాయులకు దగ్గరగానే షేరు లిస్టింగ్ నమోదైంది. లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్‌లో షిప్‌రాకెట్ షేరుకు రూ.35 ప్రీమియం ఉండటంతో.. మార్కెట్లో షేరు సుమారు రూ.132 వద్ద ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.
వివరాలు
ఐపీవో వివరాలు ఇవే..
షిప్‌రాకెట్ ఐపీవో ధరల శ్రేణిని ఒక్కో షేరుకు రూ.92 నుంచి రూ.97గా నిర్ణయించింది.
ఈ పబ్లిక్ ఆఫర్‌లో భాగంగా రూ.885.60 కోట్ల విలువైన 9.13 కోట్ల తాజా షేర్లను కంపెనీ జారీ చేసింది.
మరోవైపు రూ.731.98 కోట్ల విలువైన 7.55 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) కింద విక్రయానికి ఉంచారు.
మొత్తం ఐపీవోలో అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల (QIB) కోసం 75 శాతం వాటాను కేటాయించారు.
సంస్థాగతేతర ఇన్వెస్టర్ల (NII)కు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం షేర్లను కేటాయించారు.
ఈ ఐపీవోకు యాక్సిస్ క్యాపిటల్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరించింది. కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వహించింది.
వివరాలు
ఐపీవో నిధులతో ఏం చేస్తారు?
తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించిన నిధులను కంపెనీ తన టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యాపార విస్తరణకు వినియోగించనుంది.
ఇందులో మార్కెటింగ్, బ్రాండ్ బిల్డింగ్ కార్యక్రమాల కోసం సుమారు రూ.294 కోట్లను కేటాయించనున్నారు.
అలాగే సాంకేతిక మౌలిక వసతులను మెరుగుపరచడం,కొత్త వ్యాపార విభాగాలు, ప్రాజెక్టులను విస్తరించడం కోసం మరో రూ.211 కోట్లను ఖర్చు చేయాలని కంపెనీ ప్రణాళిక రూపొందించింది.
వివరాలు
ఈ-కామర్స్ వ్యాపారాలకు షిప్‌రాకెట్ సేవలు
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వ్యాపారాలకు ఈ-కామర్స్ కార్యకలాపాలను సులభతరం చేసే సేవలను షిప్‌రాకెట్ అందిస్తోంది.
వ్యాపార నిర్వహణ నుంచి షిప్పింగ్, చెకౌట్, పేమెంట్స్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వరకు పలు సేవలను ఒకే ప్లాట్‌ఫామ్ ద్వారా అందిస్తోంది.
వీటితో పాటు లాజిస్టిక్స్‌కు సంబంధించిన ఇతర సేవలను కూడా వ్యాపారులకు ఒకే గొడుగు కింద అందిస్తూ ఈ-కామర్స్ రంగంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.