GPF Rates: ఉద్యోగులకు షాక్.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం.. ఇప్పుడు ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేట్లను ఇటీవల సమీక్షించినప్పటికీ, ఎలాంటి మార్పులు చేయలేదు. అలాగే పీఎఫ్ (EPF) వడ్డీ రేటును కూడా 8.25 శాతంగానే కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో జీపీఎఫ్ (GPF)వడ్డీ రేట్లు పెరుగుతాయని ఆశించిన వారికి నిరాశ ఎదురైంది. కేంద్రం తాజా ప్రకటనలో జీపీఎఫ్ వడ్డీ రేటును కూడా యథాతథంగా ఉంచుతున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF)తో పాటు అదే కేటగిరీకి చెందిన ఇతర పథకాల వడ్డీ రేట్లను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా 7.10 శాతంగా కొనసాగించనుంది. ఇదే రేటు 2025-26 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో కూడా అమల్లో ఉంది.
వివరాలు
ఈ మేరకు సర్క్యులర్ జారీ
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం (బడ్జెట్ డివిజన్) ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రతి త్రైమాసికం ప్రారంభంలో వడ్డీ రేట్లను సమీక్షించినప్పటికీ, చాలా కాలంగా పెంపు జరగకపోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. జీపీఎఫ్‌తో పాటు కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ (ఇండియా), ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రావిడెంట్ ఫండ్, స్టేట్ రైల్వే ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ జీపీఎఫ్, ఇండియన్ ఆర్డినెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇండియన్ నేవల్ డాక్‌యార్డ్ వర్క్‌మెన్స్ ప్రావిడెంట్ ఫండ్, డిఫెన్స్ సర్వీసెస్ ఆఫీసర్స్ ప్రావిడెంట్ ఫండ్, ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాల వడ్డీ రేట్లను కూడా 7.10 శాతంగానే కొనసాగిస్తున్నారు.