Page Loader
Google: గూగుల్‌ ఉద్యోగులకు షాక్.. తక్కువ వేతనాల పెంపుతో అసంతృప్తి!
గూగుల్‌ ఉద్యోగులకు షాక్.. తక్కువ వేతనాల పెంపుతో అసంతృప్తి!

Google: గూగుల్‌ ఉద్యోగులకు షాక్.. తక్కువ వేతనాల పెంపుతో అసంతృప్తి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 28, 2025
11:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగులు తమ జీతాల పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో వేతన పెంపు లేకపోవడంతో వారు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ కథనం ప్రకారం, గూగుల్‌ ఉద్యోగులు ఈ అంశాన్ని తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మార్చి 25న జరిగిన సమావేశంలో జీతాల పెంపు విషయంపై తీవ్రంగా చర్చించారు. కంపెనీ ఆర్థిక స్థితి బలంగా ఉన్నా 2025 సంవత్సరానికి స్వల్ప పెంపు మాత్రమే ఇచ్చారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా జీవన వ్యయాలు పెరుగుతున్న సమయంలో గణనీయమైన వేతన పెంపు లేకపోవడం వారిని నిరాశకు గురి చేసింది.

Details

మెరుగైన వేతనం అందించేందుకు కృషి చేస్తాం

ఈ అంశంపై గూగుల్ వైస్‌ ప్రెసిడెంట్‌ జాన్‌ కేసీ స్పందిస్తూ, 2025లో 80 శాతం మంది ఉద్యోగుల వేతనాల్లో గతేడాదితో పోల్చితే పెరుగుదల నమోదైందని తెలిపారు. అయితే నాన్‌-టెక్నికల్‌ విభాగంతో పాటు మరికొన్ని విభాగాల్లోని ఉద్యోగులకు తక్కువ పెంపు మాత్రమే లభించినట్లు ఆయన అంగీకరించారు. తక్కువ జీతాల పెంపును ఎదుర్కొన్న ఉద్యోగులకు మెరుగైన వేతనం అందించేందుకు గూగుల్‌ కృషి చేస్తుందని, అధిక పనితీరు కనబరిచినవారిని ప్రోత్సహించే విధంగా వేతన విధానం కొనసాగుతుందని కేసీ వెల్లడించారు.

Details

3శాతం పెంచుతున్నట్లు ప్రకటన

అయితే గతేడాదిలో 8-10 శాతం జీత పెంపుతో పోలిస్తే ఈసారి కేవలం 3 శాతం మాత్రమే పెంచినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గూగుల్‌ గతేడాది డిసెంబర్‌లో భారీగా ఉద్యోగులను తొలగించింది. మేనేజర్‌లు, డైరెక్టర్లు, వైస్‌ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటించింది. ఏఐ సంస్థల నుంచి పెరుగుతున్న పోటీకి అనుగుణంగా తన సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ వెల్లడించింది.