LOADING...
RBI Interest Rates: సామాన్యులకు షాక్.. రెపో రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?
సామాన్యులకు షాక్.. రెపో రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?

RBI Interest Rates: సామాన్యులకు షాక్.. రెపో రేటు పెంపునకు ఆర్బీఐ సిద్ధం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 13, 2026
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) త్వరలో కీలక వడ్డీ రేట్ల పెంపు దిశగా అడుగులు వేయవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్‌ గ్లోబల్‌ మార్కెట్స్‌ తాజా నివేదిక అంచనా వేసింది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే, రాబోయే నెలల్లో రెపో రేటును 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే అవకాశముందని పేర్కొంది. ముఖ్యంగా 2026-27 ఆర్థిక సంవత్సర ద్వితీయార్థంలో ఈ మార్పులు చోటుచేసుకునే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వివరాలు

5 శాతానికి చేరనున్న ద్రవ్యోల్బణం

ఐసీఐసీఐ బ్యాంక్‌ విశ్లేషణ ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ద్రవ్యోల్బణం 5 శాతం స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే దేశంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆహార వస్తువుల ధరలు పెరుగుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా గుర్తించారు. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఆర్‌బీఐ సాధారణంగా వడ్డీ రేట్ల పెంపు వంటి చర్యలను చేపడుతుంది.

వివరాలు

ప్రస్తుతం 5.25 శాతం వద్ద రెపో రేటు

ప్రస్తుతం ఆర్‌బీఐ రెపో రేటు 5.25 శాతం వద్ద కొనసాగుతోంది. ఒకవేళ ఐసీఐసీఐ బ్యాంక్‌ అంచనాలు నిజమైతే, 50 నుంచి 75 బేసిస్‌ పాయింట్ల పెంపుతో రెపో రేటు 5.75 శాతం నుంచి 6.00 శాతం మధ్యకు చేరే అవకాశం ఉంది. కొన్ని త్రైమాసికాలుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల విషయంలో యథాతథ విధానాన్ని కొనసాగించినప్పటికీ, మారుతున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రానున్న ద్రవ్య పరపతి సమీక్షల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

వివరాలు

సామాన్యులపై ప్రభావం ఎలా ఉంటుంది?

ఆర్‌బీఐ రెపో రేటును పెంచినట్లయితే, వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. దీని ప్రభావంగా గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు పెరిగే అవకాశముంది. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారితో పాటు కొత్తగా లోన్లు పొందాలనుకునే వారిపైనా అదనపు వడ్డీ భారం పడుతుంది. అయితే మరోవైపు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో డిపాజిటర్లకు, ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు కొంత ఉపశమనం లభించవచ్చు. దేశీయ మార్కెట్‌ పరిస్థితులు, ద్రవ్యోల్బణ గమనం, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను పరిగణనలోకి తీసుకుని రాబోయే అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో ఆర్‌బీఐ తన తదుపరి ద్రవ్య పరపతి వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement