
Silver Price: వాయమ్మో.. ఇక ఏం కొంటాం.. సరికొత్త రికార్డును తిరగరాసిన వెండి ధరలు.. కిలో ఎంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ మార్కెట్ల నుండి వస్తున్న బలమైన సంకేతాలు, దేశీయంగా పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కిలో వెండి ధర రూ.1,14,493కి పెరిగింది. ఇది ఇప్పటి వరకు నమోదైన గరిష్టం. ఆర్థికంగా కొనసాగుతున్న అనిశ్చితి, పారిశ్రామిక అవసరాల పెరుగుదల వల్ల వెండి ధరలు పదేపదే పెరుగుతూ, ఆల్ టైమ్ హైను అధిగమించాయి. మంగళవారం రోజున వెండి ధర కిలోకు రూ.1,028 పెరిగింది. ఇదే రోజు ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం వెండి ధర రూ.1,14,493గా నమోదైంది. అంతకుముందు రోజు ఇదే ధర రూ.1,13,465గా ఉంది. తద్వారా, జూలై 14న నమోదైన రూ.1,13,867 గరిష్ట ధరను వెండి మించి, కొత్త రికార్డును నెలకొల్పింది.
వివరాలు
భారీగా పెరిగిన బంగారం ధరలు
ఫ్యూచర్స్ మార్కెట్ కూడా వెండి ధరల పెరుగుదలను ప్రతిబింబిస్తోంది. సెప్టెంబర్ 5న డెలివరీ అయ్యే వెండి కాంట్రాక్ట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 0.39 శాతం పెరిగి కిలోకు రూ.1,15,500కి చేరుకుంది. ఈ పెరుగుదలతో ట్రేడర్లతో పాటు పెట్టుబడిదారుల్లోనూ భారీ ఉత్సాహం కనిపించింది. వెండి ధరల పెరుగుదలతో పాటు బంగారం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఐబీజేఏ నివేదిక ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం 10 గ్రాములకు రూ.612 పెరిగి రూ.99,508కి చేరుకుంది. ఇది ముందురోజు రూ.98,896గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.74,631కి చేరినట్లుగా నమోదవగా, 22 క్యారెట్ల బంగారం ధర అదే పరిమాణానికి రూ.91,149కి పెరిగినట్టు ఐబీజేఏ తెలిపింది.