Page Loader
Silver prices: రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు 
రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు

Silver prices: రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గ్రాముకు రూ.115, కిలో గ్రాముకు రూ.1.15 లక్షలుగా నమోదు కాగా, దేశీయ మార్కెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ధర ఇదేనని తెలుస్తోంది. అంతర్జాతీయంగా బలమైన పారిశ్రామిక డిమాండ్, సరఫరాలో కొనసాగుతున్న సమస్యలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

వివరాలు 

గత వారం వెండి బాగా రాణించింది..

మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ విశ్లేషకుడు మానవ్ మోదీ ప్రకారం, గత వారం వెండి చాలా వస్తువుల కంటే మెరుగైన పనితీరును కనబర్చిందని తెలిపారు. "గత వారం వెండి అనేక వస్తువులను మించిపోయింది. దేశీయంగా ఇది ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది. COMEX మార్కెట్‌లో వెండి 40 డాలర్ల పరిధిలో ఉంది" అని ఆయన తెలిపారు. పెరుగుతున్న పారిశ్రామిక డిమాండ్, సరఫరాలో ఉన్న పరిమితులు వెండి మార్కెట్ బలాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

వివరాలు 

డిమాండ్-సరఫరా మధ్య అసంతులనం కారణం.. 

వెండి డిమాండ్‌లో సుమారు 60 శాతం సోలార్ ప్యానెల్‌లు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి పారిశ్రామిక రంగాల నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ పెరుగుతున్న డిమాండ్‌కు సరిపోయేలా సరఫరా పెరగడం లేదు. బొనాంజా సంస్థకు చెందిన సీనియర్ కమోడిటీ రీసెర్చ్ అనలిస్ట్ నిర్పేంద్ర యాదవ్ మాట్లాడుతూ... "వెండి మైనింగ్‌లో తక్కువ పెట్టుబడి ఉండటం,ఎక్కువగా ఇతర లోహాల మైనింగ్‌లో ఉప ఉత్పత్తిగా ఇది లభించటం వంటివి వరుసగా ఐదవ సంవత్సరం సరఫరా లోటుకు దారితీశాయి" అని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు సరఫరాలో ఏర్పడుతున్న గ్యాప్‌ కారణంగానే వెండి ధరలు ఎగబాకుతున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది.. 

పారిశ్రామిక వినియోగం,విలువైన లోహం అనే ద్వంద్వ గుణాల కారణంగా వెండి పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ఈ విషయాన్ని ట్రేడ్‌జిని సంస్థ COO త్రివేశ్ వివరించారు. ఆయన తెలిపిన ప్రకారం, 2025 మే నెలలో రూ.854 కోట్ల విలువైన వెండి ETFల్లో పెట్టుబడులు నమోదయ్యాయి. ఇది బంగారు ETFలతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు అధికం కావడం గమనార్హం. పారిశ్రామిక వినియోగంతోపాటు భద్రతా మాధ్యమంగా కూడా వెండి ప్రధానంగా కనిపించటంతో, పెట్టుబడిదారులు ఈ లోహంపై ఎక్కువ దృష్టి పెట్టుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.