Gold, Silver Prices: పెరుగుతున్న చమురు ధరలు.. భారీగా పడిపోతున్న బంగారం,వెండి ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ మార్కెట్‌లో బంగారం,వెండి ధరలు గురువారం గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా వెండి కొనుగోలుదారులకు ఇది కొంత ఊరటనిచ్చినా,పెట్టుబడిదారుల్లో మాత్రం ఆందోళన నెలకొంది. ముడి చమురు ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని,వడ్డీ రేట్ల తగ్గింపు ఆలస్యం కావచ్చనే సంకేతాలే ఈ పడిపాటుకు ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కరోజులోనే రూ.6,100 క్షీణించిన వెండి దేశీయ వాణిజ్య మార్కెట్‌లో వెండి ధరలు భారీగా క్షీణించాయి. కిలో వెండిపై సుమారు 2.5 శాతం అంటే దాదాపు రూ.6,100 తగ్గి, రూ.2,42,220 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,000 (0.6 శాతం) తగ్గి రూ.1,51,719 వద్ద నమోదైంది.
వివరాలు
చమురు ప్రభావం.. బంగారంపై ఒత్తిడి
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఇదే ధోరణి కనిపించింది. వెండి ధరలు 1.4శాతం తగ్గి 76.64 డాలర్లకు చేరాయి. అలాగే ప్లాటినం, పల్లాడియం వంటి ఇతర విలువైన లోహాలు కూడా 1శాతం కంటే ఎక్కువగా నష్టపోయాయి. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం భిన్న దృశ్యం కనిపిస్తోంది.ముడి చమురు ధరలు బారెల్‌కు 100 డాలర్లకు పైగా కొనసాగుతుండటంతో రవాణా,ఉత్పత్తి ఖర్చులు పెరిగే పరిస్థితి ఉంది. చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం అధికమవుతుందని,దాంతో అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం తగ్గిపోతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గకపోతే పెట్టుబడిదారులు బంగారం వైపు కాకుండా బాండ్లు, డిపాజిట్ల వైపు మళ్లే అవకాశముంది.
వివరాలు
హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం కావడంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ రెండు నౌకలను స్వాధీనం చేసుకోవడం చమురు సరఫరాపై ప్రభావం చూపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులను నిలిపివేసినా, ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఖర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తేనే కాల్పుల విరమణకు అర్థం ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల కారణంగా చమురు ధరలు త్వరలో తగ్గే సూచనలు కనిపించడం లేదు.
వివరాలు
వడ్డీ రేట్ల తగ్గింపుపై అనిశ్చితి
తాజా సర్వే ప్రకారం, అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు మరో ఆరు నెలల వరకు వాయిదా పడే అవకాశం ఉంది. గతంలో ఈ ఏడాదిలో రెండుసార్లు వడ్డీ రేట్లు తగ్గుతాయని భావించిన పెట్టుబడిదారులు, ఇప్పుడు డిసెంబర్‌లో కూడా తగ్గింపు అవకాశాన్ని కేవలం 23 శాతంగా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలు బంగారం, వెండి ధరలపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి. భారతదేశం చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైనే ఆధారపడటం వల్ల, చమురు ధరల పెరుగుదల దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. దాంతో రూపాయి విలువ తగ్గే అవకాశం ఉండటంతో పాటు, సాధారణ ప్రజల పొదుపుపై కూడా ప్రభావం పడుతుంది.