Silver rates: రికార్డు ర్యాలీ తర్వాత వెండికి బ్రేక్.. కిలోకు రూ.18 వేలకుపైగా పతనం
ఈ వార్తాకథనం ఏంటి
2025 చివరి ట్రేడింగ్ సెషన్ అయిన బుధవారం రోజు వెండి ధరలు భారీగా తగ్గాయి. ఈ ఏడాది వెండి రికార్డు స్థాయిలో పెరగడంతో లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జరగడంతో ధరలపై ఒత్తిడి పడింది. ఫలితంగా వెండి రేట్లు వరుసగా నష్టాలను చవిచూశాయి. ఎంసీఎక్స్ (MCX)లో వెండి ధర కిలోకు 7.5 శాతం లేదా రూ.18 వేలకుపైగా పడిపోయి రూ.2,32,228కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్ (COMEX)లో వెండి ధర ఔన్స్‌కు 71 డాలర్ల దగ్గరికి చేరింది. అయితే రోజులో కనిష్ఠంగా 70.315డాలర్లను తాకిన వెండి ధర, గత ముగింపుతో పోలిస్తే సుమారు 9శాతం తగ్గింది.
వివరాలు
2025లో వెండి ధర దాదాపు 150 శాతం వరకు పెరిగింది
ఇదే సమయంలో బంగారం ధరలు కూడా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,550 తగ్గి రూ.1,35,116 వద్ద ట్రేడయ్యింది. ఈ ఏడాది వెండి చరిత్రలోనే అత్యుత్తమ వార్షిక ప్రదర్శన వైపు దూసుకెళ్తోంది. 2025లో వెండి ధర దాదాపు 150 శాతం వరకు పెరిగింది. మరోవైపు బంగారం కూడా బలంగా రాణించి సుమారు 65 శాతం పెరిగింది. భూకార్యాచరణ,యుద్ధ భయాలు,అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం,కేంద్ర బ్యాంకుల భారీ కొనుగోళ్లు, ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరగడం వంటి అంశాలు బంగారం,వెండి ధరలకు మద్దతుగా నిలిచాయి. అంతేకాదు, సరఫరా లోపం, నిల్వలు తక్కువగా ఉండటం, పరిశ్రమల నుంచి డిమాండ్ పెరగడం వల్ల వెండి ఈ ఏడాది కీలక స్థాయిలను దాటింది.
వివరాలు
పాలసీ నిర్ణయకర్తల మధ్య భేదాభిప్రాయాలు
ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ పాలసీ సమావేశానికి సంబంధించిన మినిట్స్ మంగళవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, రానున్న కాలంలో వడ్డీ రేట్ల కోతలకు అవకాశం ఉందని పలువురు అధికారులు సూచించారు. అయితే వడ్డీ రేట్లు ఎప్పుడు, ఎంత మేర తగ్గించాలి అన్న విషయంలో మాత్రం పాలసీ నిర్ణయకర్తల మధ్య భేదాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. రష్యా-యుక్రెయిన్ శాంతి ఒప్పందంపై అనిశ్చితి, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికా-వెనిజువేలా మధ్య ఉద్రిక్త సంబంధాలు వంటి భౌగోళిక రాజకీయ అంశాలు కూడా ఈ ఏడాది సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండిపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.
వివరాలు
వెండి ర్యాలీకి బ్రేక్ పడిందా?
రికార్డు స్థాయి ర్యాలీ తర్వాత ఒక్కసారిగా అమ్మకాలు పెరగడంతో వెండి భవితవ్యంపై చర్చ మొదలైంది. అయితే మార్కెట్ నిపుణులు ఈ ర్యాలీ పూర్తిగా ముగిసిపోలేదని, కేవలం దిశ మార్చుకుంటోందని అంటున్నారు. తాత్కాలికంగా ఊగిసలాట ఉన్నా, పరిశ్రమలు,దీర్ఘకాలిక పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ కొనసాగుతుందని వారు చెబుతున్నారు. సుగంధ సచ్‌దేవా మాట్లాడుతూ, వెండి మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి స్వభావంలో గణనీయమైన మార్పు వచ్చిందని తెలిపారు.
వివరాలు
వెండి ధరలు మరింత తగ్గే అవకాశం
వెండి ర్యాలీ పూర్తిగా ఆగిపోలేదు. ఇప్పటివరకు డెలివరీ తీసుకోని పేపర్ ట్రేడర్ల చేతుల్లో ఉన్న డిమాండ్, ఇప్పుడు పరిశ్రమలు,దీర్ఘకాలిక పెట్టుబడిదారుల వైపు మారింది. ఉత్పత్తి కొనసాగించేందుకు పరిశ్రమలు వెండిని కొనుగోలు చేస్తుండగా, ఆసియా,లండన్, సింగపూర్‌లలోని ప్రైవేట్ వాల్ట్స్‌లో భౌతిక వెండికి డిమాండ్ బలంగా కొనసాగుతోంది"అని ఆమె పేర్కొన్నారు. ధరలు కొంత సవరించుకున్నా భౌతిక డిమాండ్ మద్దతుగా ఉందన్నారు. టెక్నికల్ పరంగా చూస్తే, అంతర్జాతీయ మార్కెట్లలో కీలక మద్దతు స్థాయిలపై విశ్లేషకులు దృష్టి పెట్టారు. అంతర్జాతీయ మార్కెట్ అయిన కామెక్స్‌లో వెండి ధరకు ఔన్స్‌కు 70 డాలర్లు కీలక మద్దతు స్థాయిగా ఉందని అనుజ్ గుప్తా చెప్పారు. ఈ స్థాయి కంటే దిగువకు వెళ్తే వెండి ధరలు మరింత తగ్గే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
వివరాలు
70 డాలర్లు నుంచి 78 డాలర్ల మధ్య వెండి ధరలు స్థిరపడే అవకాశం
అగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రేణీషా చైనానీ మాట్లాడుతూ, ఇటీవల వెండి ధరలు భారీగా ఎగబాకిన తర్వాత కొంత సవరణ ఎదుర్కొన్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇకపై వెండి ధరలు ఒక్కసారిగా పైకి లేదా కిందికి వెళ్లకుండా, ఒక నిర్దిష్ట పరిధిలోనే ఊగిసలాట చూపే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. ఔన్స్‌కు 70 డాలర్లు (సుమారు రూ.2.23 లక్షలు) నుంచి 78 డాలర్లు (సుమారు రూ.2.50 లక్షలు) మధ్య వెండి ధరలు స్థిరపడే అవకాశముందని ఆమె అభిప్రాయపడ్డారు.