
UIDAI launches SITAA: డిజిటల్ గుర్తింపు భద్రతకు కొత్త వ్యూహం.. రంగంలోకి 'సిటా'
ఈ వార్తాకథనం ఏంటి
డీప్‌ఫేక్ టెక్నాలజీ రోజురోజుకూ దుర్వినియోగానికి గురవుతోంది. ఈ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి భారీగా డబ్బు దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ 'ఉడాయ్' (UIDAI) అప్రమత్తమైంది. దేశ డిజిటల్ ఐడెంటిటీ విధానాన్ని మరింత బలపర్చేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా 'స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్' (SITAA) పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. డీప్‌ఫేక్‌లు, స్ఫూఫింగ్, ప్రజెంటేషన్ అటాక్స్ వంటి సైబర్ ప్రమాదాలను అడ్డుకోవడం ఈ కార్యక్రమ లక్ష్యం. దీనికి స్టార్టప్‌లు, పరిశ్రమ సంస్థలు, విద్యాసంస్థలు, పరిశోధకుల సహకారాన్ని తీసుకోబోతోంది.
Details
అభివృద్ధి కోసం స్టార్టప్ సంస్థలు ఆహ్వానం
వీరి ద్వారా అధునాతన బయోమెట్రిక్ టెక్నాలజీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అథంటికేషన్ సొల్యూషన్లు, డేటా ప్రైవసీ రంగాల్లో సరికొత్త మార్గాలను అన్వేషించనుంది. ప్రపంచంలోనే అత్యంత భద్రమైన డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నిర్మించాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను ఉడాయ్ రూపొందించింది. ఇందుకోసం నవంబర్ 15 వరకు వివిధ వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ కార్యక్రమంలో MeitY స్టార్టప్ హబ్ (MSH), నాస్కామ్ సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. ఫేస్‌లైవ్ డిటెక్షన్ కోసం SDKల అభివృద్ధికి స్టార్టప్ సంస్థలను ఉడాయ్ ఆహ్వానిస్తోంది. ఫోటోలు, వీడియోలు, మాస్కులు, మార్ఫింగ్‌ల ద్వారా జరిగే స్ఫూఫింగ్ దాడులను నిరోధించడం ప్రధాన ఉద్దేశం.
Details
ప్రతిపాదనలను సమర్పించనున్న సంస్థలు
అలాగే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా 'ప్రజెంటేషన్ అటాక్ డిటెక్షన్' వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు విద్యా, పరిశోధనా సంస్థలు తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ అథంటికేషన్ ఎకోసిస్టంతో అనుసంధానం అయ్యే విధంగా మొబైల్ ఫోన్లు, తక్కువ ఖర్చు కలిగిన ఇమేజింగ్ పరికరాల ద్వారా ఫింగర్ ప్రింట్ అథంటికేషన్ చేయగల సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్లు రూపొందించాలని ఉడాయ్ స్పష్టం చేసింది. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధార్ సేవలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం కూడా వారి ప్రధాన లక్ష్యంగా ఉంది. స్టార్టప్‌లు, పరిశోధకులు, పరిశ్రమ ప్రతినిధులు MSH పోర్టల్ ద్వారా ఈ SITAA కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవాలని ఉడాయ్ ప్రకటించింది.