Tata Sons listing: టాటా సన్స్ లిస్టింగ్‌పై మళ్లీ వేడెక్కిన వివాదం
ఈ వార్తాకథనం ఏంటి
టాటా సన్స్ లిస్టింగ్ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. సంస్థను స్టాక్ మార్కెట్‌లో నమోదు చేయాలా? వద్దా? అనే విషయంలో టాటా గ్రూప్‌లోని అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి. టాటా ట్రస్ట్స్ ట్రస్టీ అయిన వేణు శ్రీనివాసన్ లిస్టింగ్‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించగా, ప్రారంభం నుంచే అనుకూలంగా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కూడా తన మద్దతును పునరుద్ఘాటించింది. దీంతో ఈ అంశంపై తుది నిర్ణయం ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైపు మళ్లింది.
వివరాలు
రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టమైన మార్గదర్శకత్వం
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ షాపూర్జీ పల్లోంజీ మిస్త్రీ మాట్లాడుతూ, టాటా సన్స్ లిస్టింగ్ కేవలం నియంత్రణ నిబంధన మాత్రమే కాకుండా అవసరమని తెలిపారు. లిస్టింగ్ వల్ల సంస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని, ఇది సంస్థ పాలనను మరింత బలపరుస్తుందని చెప్పారు. ఇవే టాటా గ్రూప్‌కు ప్రధాన విలువలని పేర్కొన్నారు. లిస్టింగ్ ద్వారా చిన్న పెట్టుబడిదారులకు ప్రయోజనం కలుగుతుందని, టాటా ట్రస్ట్స్‌కు స్థిరమైన లాభాంశ ఆదాయం లభించి, దానితో మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ నుంచి స్పష్టమైన మార్గదర్శకత్వం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
వివరాలు
ఏమిటీ వివాదం?
టాటా సన్స్‌ను అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా రిజర్వ్ బ్యాంక్ గుర్తించింది. ఈ వర్గీకరణ ప్రకారం సంస్థను స్టాక్ మార్కెట్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. టాటా సన్స్‌లో 66 శాతం వాటా కలిగిన టాటా ట్రస్ట్స్ మాత్రం లిస్టింగ్‌కు వ్యతిరేకంగా ఉంది. లిస్టింగ్ వల్ల ట్రస్ట్స్ నియంత్రణ తగ్గి, బయటి వ్యక్తుల ప్రభావం పెరిగే అవకాశం ఉందని ట్రస్ట్ ఛైర్మన్ నోయల్ టాటాతో పాటు ఇతర ట్రస్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
18.37 శాతం వాటాను తనఖా పెట్టిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్
ఇదిలా ఉంటే, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ మాత్రం మొదటి నుంచే లిస్టింగ్‌కు మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఈ గ్రూప్, టాటా సన్స్‌లో తనకు ఉన్న 18.37 శాతం వాటాను తనఖా పెట్టింది. ఆ వాటాలను తిరిగి పొందేందుకు లిస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతోంది. మరోవైపు, అప్పర్ లేయర్ నాన్ బ్యాంకింగ్ సంస్థలకు సంబంధించిన మార్గదర్శకాలను రిజర్వ్ బ్యాంక్ త్వరలో సవరించనుంది. ఈ నేపథ్యంలో సంస్థ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని మినహాయింపు ఇస్తుందా? లేక లిస్టింగ్ తప్పనిసరి చేస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.