LOADING...
SpaceX: స్పేస్‌ఎక్స్ భారీ ఐపీవో.. $1.75 ట్రిలియన్ విలువతో $75 బిలియన్ సమీకరణ లక్ష్యం
స్పేస్‌ఎక్స్ భారీ ఐపీవో..$1.75 ట్రిలియన్ విలువతో $75 బిలియన్ సమీకరణ లక్ష్యం

SpaceX: స్పేస్‌ఎక్స్ భారీ ఐపీవో.. $1.75 ట్రిలియన్ విలువతో $75 బిలియన్ సమీకరణ లక్ష్యం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ స్థాపించిన అంతరిక్ష సంస్థ స్పేస్‌-X త్వరలోనే భారీ ఐపీవోకు సిద్ధమవుతోంది. తాజాగా బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో ఈ ప్రణాళికలను కంపెనీ వెల్లడించింది. ఈ ఐపీఓలో రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. మొత్తం షేర్లలో దాదాపు 30% వరకు సాధారణ పెట్టుబడిదారులకు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఇది ఇప్పటివరకు ఏ ఐపీవోలోనూ చూడని ప్రత్యేక వ్యూహంగా భావిస్తున్నారు.

వివరాలు 

ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్లు కీలక పాత్ర

స్పేస్‌ఎక్స్ సీఎఫ్‌ఓ బ్రెట్ జాన్సెన్ మాట్లాడుతూ, ఈ ఐపీవోలో రిటైల్ ఇన్వెస్టర్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా సాధారణ పెట్టుబడిదారులకు అవకాశం కల్పిస్తామని ఆయన చెప్పారు. రోడ్‌షో ప్రారంభమైన తర్వాత జూన్‌లో 1,500 మంది రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. యూకే, యూరప్, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, కొరియా వంటి దేశాల పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది.

వివరాలు 

జూన్ 8 వారం నుంచి రోడ్‌షో

ఈ ఐపీవో చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచే అవకాశం ఉంది. కంపెనీ $75 బిలియన్ సమీకరించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. దీంతో స్పేస్‌ఎక్స్ విలువ $1.75 ట్రిలియన్ వరకు చేరొచ్చని అంచనా. జూన్ 8 వారం నుంచి రోడ్‌షో ప్రారంభమవుతుండగా, కంపెనీ ప్రతినిధులు, బ్యాంకర్లు కలిసి పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారు. ఇందుకు ముందు 21 బ్యాంకులకు చెందిన 125 మంది ఆర్థిక నిపుణులతో సమావేశం జరగనుంది.

Advertisement

వివరాలు 

ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు స్పేస్‌ఎక్స్ కొత్త తరహా వ్యూహాలు

ఇక ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు స్పేస్‌ఎక్స్ కొత్త తరహా వ్యూహాలు కూడా అమలు చేయనుంది. ఆసక్తి ఉన్న పెట్టుబడిదారులను రాకెట్ లాంచ్ సెంటర్లకు ఆహ్వానించి ప్రత్యక్షంగా ప్రయోగాలు, తయారీ ప్రక్రియను చూపించే అవకాశం ఉంది. ఈ విధానం ఈ రంగంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. దీని ద్వారా కంపెనీ తన భవిష్యత్ అభివృద్ధిపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

Advertisement

వివరాలు 

షేర్ ధరల్లో మార్పులు

ఫిబ్రవరిలో మస్క్‌కు చెందిన xAI సంస్థతో విలీన సమయంలో స్పేస్‌ఎక్స్ విలువ $1.25 ట్రిలియన్‌గా ఉండగా, ఇప్పుడు $1.75 ట్రిలియన్ లక్ష్యంగా పెట్టుకోవడం పెద్ద ఎత్తున పెరుగుదలగా భావిస్తున్నారు. అంతకు ముందు టెండర్ ఆఫర్ సమయంలో కంపెనీ విలువ $800 బిలియన్‌గా నమోదైంది. అయితే ఈ భారీ విలువ పెట్టుబడిదారులకు లాభాలు తీసుకురావొచ్చని భావిస్తున్నప్పటికీ, అధిక ధరల వల్ల ఐపీవో తర్వాత షేర్ ధరల్లో మార్పులు వచ్చే అవకాశంపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement