SpaceX IPO: స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. 4,400 మంది ఉద్యోగులు మిలియనీర్లు.. ఎలాన్ మస్క్‌కు ట్రిలియనీర్ ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
సుమారు 25 ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ఓ స్టార్టప్‌గా ప్రయాణం మొదలుపెట్టిన స్పేస్-X (SpaceX) ఇప్పుడు ప్రపంచ వ్యాపార చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో సంచలనం సృష్టించబోతోంది. ప్రారంభ రోజుల్లో ఈ సంస్థ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన వారు చాలామందే. కొందరు ఉద్యోగులు కంపెనీ నిలదొక్కుకోలేదనే భావనతో మధ్యలోనే ఉద్యోగాలను వదిలేశారు. అయితే, సంస్థపై నమ్మకంతో కొనసాగిన ఉద్యోగులకు ఇప్పుడు అదృష్టం తలుపుతట్టింది. స్పేస్‌ఎక్స్ ఐపీఓ (IPO) కారణంగా దాదాపు 4,400 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు మిలియనీర్లుగా మారబోతున్నారు. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌లో 22 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరు రాకెట్ లాంచ్ కేంద్రాల్లో, మరికొందరు తయారీ యూనిట్లు, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్‌లలో సేవలందిస్తున్నారు.
వివరాలు
400 మంది ఉద్యోగులకు 100మిలియన్ డాలర్లు
గత పాతికేళ్లలో వందలాది మంది ఉద్యోగులు రిటైర్మెంట్ లేదా రాజీనామాల ద్వారా సంస్థను వీడినా, ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా కంపెనీ వారికి వేతనాలు,బోనస్‌ల రూపంలో షేర్లను కేటాయించింది. అప్పట్లో పెద్దగా విలువలేని ఆ షేర్లు, ఇప్పుడు ఐపీఓతో బంగారు బాతులుగా మారాయి. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ వేదిక హిల్.కామ్ వెల్లడించిన వివరాల ప్రకారం,స్పేస్‌ఎక్స్ ఐపీఓ కారణంగా 4,400 మందికి పైగా ప్రస్తుత,మాజీ ఉద్యోగులు మిలియనీర్లు కానున్నారు. వీరిలో దాదాపు 400 మంది ఉద్యోగులకు 100మిలియన్ డాలర్లకు పైగా సంపద లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.956 కోట్లకు పైగా ఉంటుంది. సాధారణంగా ఐపీఓల ద్వారా కంపెనీ వ్యవస్థాపకులు, ప్రధాన పెట్టుబడిదారులు మాత్రమే భారీగా లాభపడుతుంటారు.
వివరాలు
ఓ ఉద్యోగి వద్ద ప్రస్తుతం లక్షకు పైగా షేర్లు
కానీ, వేలాది మంది ఉద్యోగులు ఒకేసారి మిలియనీర్లు కావడం వ్యాపార చరిత్రలో అరుదైన ఘటనగా నిపుణులు చెబుతున్నారు. గత 12 ఏళ్లుగా స్పేస్‌ఎక్స్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వద్ద ప్రస్తుతం లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు సమాచారం. ఐపీఓ తర్వాత వాటి విలువ 13.5 మిలియన్ డాలర్లకు చేరుకోనుండగా, భారత కరెన్సీలో అది దాదాపు రూ.129 కోట్లుగా ఉంటుంది. మరోవైపు, కంపెనీ భవిష్యత్తుపై నమ్మకం లేక కొందరు మాజీ ఉద్యోగులు తమ షేర్లను అప్పుడే విక్రయించేశారు. మరికొందరు రెస్టారెంట్ గిఫ్ట్ కార్డులు లేదా ఇతర చిన్న అవసరాల కోసం వాటిని మార్పిడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షేర్ల విలువలు చూసి వారు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నారని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు.
వివరాలు
స్పేస్‌ఎక్స్ ఐపీఓ జూన్ 12న ప్రారంభం
స్పేస్‌ఎక్స్ ఐపీఓ జూన్ 12న ప్రారంభం కానుంది. ఒక్కో షేరు ధరను 135డాలర్లుగా నిర్ణయించారు. భారత కరెన్సీలో దీని విలువ రూ.12వేలకుపైగా ఉంటుంది. ఈ ఐపీఓలో మొత్తం 55.56 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుండగా, దీని ద్వారా కంపెనీ 75 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓగా 2019లో సౌదీ ఆరామ్‌కో చేపట్టిన 29.4 బిలియన్ డాలర్ల ఇష్యూ రికార్డు సృష్టించింది. అయితే, స్పేస్‌ఎక్స్ ఆ రికార్డును భారీ తేడాతో అధిగమించి మార్కెట్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాయబోతోంది. ఇదే సమయంలో ఈ ఐపీఓతో కంపెనీ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సంపద మరింత పెరిగి, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.