Space-X: 60 బిలియన్ డాలర్ల భారీ డీల్.. కర్సర్'తో స్పేస్ X ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్నకర్సర్ స్టార్టప్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది చివరికి కర్సర్ ను 60 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసే అవకాశం స్పేస్ X కు ఉంది. లేకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న భాగస్వామ్యంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశం కూడా ఉంది. భవిష్యత్‌లో కంపెనీ పబ్లిక్ లిస్టింగ్‌ను దృష్టిలో పెట్టుకుని AI ఆధారిత సాఫ్ట్‌వేర్ రంగంలో ముందంజలో ఉండాలనే వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2023లో ప్రారంభమైన కర్సర్ AI టూల్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి విధానాన్ని పూర్తిగా మార్చేసింది.
వివరాలు
కర్సర్, AI రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్
కోడ్ రాయడం, టెస్టింగ్ చేయడం,బగ్స్ సరిచేయడం వంటి పనులను సులభతరం చేస్తోంది. ప్రస్తుతం టెక్ ప్రపంచంలో "వైబ్ కోడింగ్"గా పిలుస్తున్న కొత్త ట్రెండ్‌లో ఈ టూల్ కీలక పాత్ర పోషిస్తోంది. 2023లో స్థాపించిన కర్సర్, AI రంగంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న స్టార్టప్‌లలో ఒకటిగా నిలిచింది. స్పేస్ X ఒప్పందానికి ముందు దాదాపు 50 బిలియన్ డాలర్ల విలువతో 2 బిలియన్ డాలర్లు సమీకరించే దశలో కంపెనీ ఉంది. ఈ రౌండ్‌లో ఆండ్రీసెన్ హొరోవిట్జ్, NVIDIA వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఎలాన్ మస్క్‌కు AI రంగంపై ఆసక్తి కొత్తది కాదు. ఆయన ఓపెన్‌ఏఐ సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.
వివరాలు
AI కోడింగ్ రంగంలో పెద్ద ముందడుగు
అలాగే xAI అనే సంస్థను కూడా ప్రారంభించారు. గత ఏడాది నుంచే SpaceXలో AI ప్రాజెక్టులపై ఫోకస్ పెంచారు. అంతేకాకుండా ఫిబ్రవరిలో xAI సంస్థను భారీ ఒప్పందంతో కొనుగోలు చేశారు. Cursor సీఈఓ మైఖేల్ ట్రుయెల్ ఈ భాగస్వామ్యాన్ని సోషల్ మీడియా వేదిక Xలో ధృవీకరించారు. AI ఆధారిత కోడింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించేందుకు SpaceXతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇది AI కోడింగ్ రంగంలో పెద్ద ముందడుగని ఆయన పేర్కొన్నారు.