SpiceJet: స్పైస్‌జెట్ కి ఎన్‌సీఎల్‌టీ నోటీసు జారీ
రుణభారంతో సతమతమవుతున్న స్పైస్‌జెట్‌కు సోమవారం మరోసారి ఎన్‌సీఎల్‌టీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. టెక్‌జాకీ ఇన్ఫోటెక్ అనే ఆపరేషనల్ క్రెడిటర్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా ఎన్‌సీఎల్‌టీ ఈ నిర్ణయం తీసుకుంది. మహేంద్ర ఖండేల్‌వాలా,సంజీవ్ తంజాన్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను పరిశీలించి, నోటీసులు జారీ చేసి నవంబర్ 14వ తేదీ విచారణకు వాయిదా వేసింది. టెక్‌జాకీ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌లో స్పైస్‌జెట్ తమ నుండి రూ.1.2 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్ సేవలను వాడినప్పటికీ చెల్లింపులు చేయలేదని పేర్కొంది. ఈ బకాయిల పరిష్కారానికి దివాలా ప్రక్రియను ప్రారంభించాలని కోరింది.
రూ.3,000 కోట్లు సమీకరణ
జూన్ 2023లో, ఐర్లాండ్ కేంద్రంగా ఉన్న ఈఎల్‌ఎఫ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కూడా స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. ఈఎల్‌ఎఫ్ సంస్థకు స్పైస్‌జెట్ 12మిలియన్ డాలర్ల బకాయి చెల్లించాల్సి ఉంది. ఇంజిన్ ఫైనాన్సింగ్‌లో ఇది ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి సంస్థగా ఉంది. మరోవైపు,స్పైస్‌జెట్‌పై పలు రుణదాతలు దివాలా పిటిషన్లు కూడా దాఖలు చేసిన విషయం తెలిసిందే. రూ.3,000 కోట్ల సమీకరణ స్పైస్‌జెట్ సోమవారం క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.3,000 కోట్ల నిధులను సమీకరించినట్లు ప్రకటించింది. ఈ నిధుల సమీకరణ సెప్టెంబర్ 16న ప్రారంభమై,18న ముగిసింది.ఈ క్యూఐపీకి భారీగా స్పందన లభించి,ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యిందని స్పైస్‌జెట్ తెలిపింది. ఈ మొత్తానికి అదనంగా,గత ఫండింగ్ రౌండ్ ద్వారా మరో రూ.736 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.